టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు సరికొత్తగా నేరాలకు పాల్పడుతున్నారు. తమ దోపిడీని కూడా అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి అకౌంట్ డీటెయిల్స్ తీసుకోవడం.. ఏటీఎం పిన్ నంబర్ అడగడం ఇవన్నీ పాతపద్ధతులు. ఈ తరహా మోసం గురించి జనాలకు తెలిసిపోవడంతో.. విభిన్న పద్ధతుల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. అదే.. వాట్సాప్ మోసం. దీంతో ఎలా మోసం చేస్తున్నారు? దాన్ని ఎలా అడ్డుకోవాలి? అన్నది చూద్దాం.
ముందుగా ఫోన్ కు మెసేజ్ ద్వారా లింకులు పంపించి.. ఎవరో ఒక అమాయకుడిని ట్రాప్ చేస్తున్నారు. ఆ విధంగా అతడి ఫోన్ హ్యాక్ చేసి, అతని ఫోన్లోని కాంటాక్ట్ లిస్టు మొత్తం సేకరిస్తున్నారు. ఆ తర్వాత హ్యాక్ చేసిన నంబర్ నుంచే.. వాళ్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు. ఏదో అత్యవసరం ఉందని వెంటనే డబ్బులు కావాలని మెజేస్ లు చేస్తున్నారు. వీళ్లు అడిగింది మన ఫ్రెండే కదా.. ఎలాంటి అవసరంలో ఉన్నాడో అని వెంటనే పంపిస్తున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు.
ఇక, ఇదే కాంటాక్ట్ లిస్టులోని మరికొందరికి వాట్సాప్ ద్వారా లింకులు పంపిస్తున్నారు. పంపించింది మనవాడే కదా.. అనుకొని వాళ్లు ఆ లింక్ ను క్లిక్ చేసి ఓపెన్ చేయగానే.. ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతోంది. దీంతో.. వాళ్ల ఫోన్లోని బ్యాంక్ డీటెయిల్స్ తోపాటు కాంటాక్ట్ లిస్టును కూడా తీసుకొని మోసాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి మోసాలు ఈ మధ్య బాగా పెరిగిపోయాయని పోలీసులు చెబుతున్నారు.
గడిచిన మూడు రోజుల్లోనే హైదరాబాద్ లో దాదాపు 4 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు బాధితులు. ముగ్గురి నుంచే ఈ మొత్తం లాగించారు కేటుగాళ్లు. అందుకే.. వాట్సాప్ కు ఏదైనా లింకులు వస్తే.. వెంటనే ఓపెన్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఎవరైనా ఫోన్ చేసి పొరపాటున మా ఓటీపీ మీకు వచ్చింది, చెప్పండని అడిగితే చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్న తర్వాత బాధపడితే ఉపయోగం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.