
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రాఘురామ కృష్ణంరాజు కేసు ఆసక్తికరంగా మారింది. సామాజికవర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించారని, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేసేందుకు కుట్ర చేశారని ఆయనపై కేసు నమోదుచేసింది సీఐడీ. దీంతో.. తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు రఘురామ. అయితే.. సీఐడీ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది హైకోర్టు.
ఆ తర్వాత పలు మలుపుల అనంతరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు రఘురామ. మరోవైపు ఆయన కుమారుడు కూడా సుప్రీంను ఆశ్రయించారు. పోలీస్ కస్టడీలో తన తండ్రిని వేధించారంటూ ఆయన కొడుకు భరత్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్లు ఇవాళ (సోమవారం) విచారణకు రానున్నాయి.
ఇదిలాఉండగా.. రఘురామను రమేష్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. రమేష్ ఆసుపత్రికి తీసుకెళ్లడం అంటే.. తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి పంపించడం లాంటిదేనని అన్నారు. అంతేకాకుండా.. అగ్నిప్రమాదం ఘటనలో పది మంది చనిపోయిన విషయమై ఆసుపత్రి ఎండీపై కేసు నమోదైన విషయం కూడా కోర్టు దృష్టి తెచ్చారు.
అయితే.. కోర్టు ఇవేవీ పట్టించుకోలేదు. ఉత్తర్వులను రెండు రోజులు నిలుపుదల చేయాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. మరోవైపు.. మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ తరపు లాయర్ సూచించింది ధర్మాసనం. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
కాగా.. ఎంపీని ఆదివారమే రమేష్ ఆసుపత్రికి తరలిస్తారని భావించినా.. అది జరగలేదు. దీంతో.. సోమవారం ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. మరోవైపు సుప్రీం కూడా ఇదే రోజున విచారణ విచారణ చేపట్టబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.