Homeజాతీయ వార్తలుCM KCR: కేసీఆర్ ఈసారి ఏం ప్లాన్ చేస్తారో?

CM KCR: కేసీఆర్ ఈసారి ఏం ప్లాన్ చేస్తారో?

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలక ఇంకా పట్టుమని నాలుగు నెలలు కూడా లేదు. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఈనెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బహుషా ఇదే చివరి అసెంబ్లీ సమేశాలనుకుంటా. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినెట్‌ను సమావేశపరుస్తున్నారు కేసీఆర్‌. ఎన్నికలకు ముందు నిర్వహించే ఈ కేబినెట్‌ సమావేశం పూర్తిగా అన్నివర్గాల వారికి వరాలు కురుస్తాయని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.

విపక్షాలను దెబ్బకొట్టేలా..
ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు అన్నివర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా పలు ప్రకటనలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. బీజేపీ కూడా మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేలా.. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా చేసేలా గులాబీ వ్యూహం ఉండబోతుందని సమాచారం.

కీలక నిర్ణయాలు..
తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. వరుస నిర్ణయాలతో అందరినీ ఆకట్టుకొనేలా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు జరగనున్న కేబినెట్‌ సమావేశం పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేచనుంది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీలో ’మెట్రో’ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపే అవకాశముంది. వీటితోపాటు మొత్తం 22 అంశాలతో కూడిన ఎజెండాపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. హైదరాబాద్‌ చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు టిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించే తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌–2022 బిల్లును కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది.

ఉద్యోగులకు వరాలు..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) ఏర్పాటు, ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ, వర్షాలు, వరదలతో జరిగిన నష్టం, సహాయ.. పునరుద్ధరణ చర్యలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఆసరా పింఛన్ల పెంపు తదితర అంశాలపై కూడా సోమవారం జరగనున్న మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సింగరేణి కాలరీస్‌ సంస్థకు బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో వెయ్యి చదరపు గజాల ప్రభుత్వ భూమిని మార్కెట్‌ ధరకు విక్రయించే ప్రతిపాదనను కూడా కేబినెట్‌ ఎజెండాలో చేర్చారు. విద్యుత్‌ కొనుగోళ్ల బకాయిల చెల్లింపు, ట్రాన్స్‌మిషన్‌ చార్జీల చెల్లింపునకుగాను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ), బ్యాంకుల నుంచి ట్రాన్స్‌కో సేకరించనున్న రూ.5 వేల కోట్ల రుణాలకు పూచీకత్తుపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

200 ఎకరాలు వేలం..
బుద్వేల్‌లో ఉన్న దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్‌ఎండీఏ ద్వారా వేలం వేసే ప్రతిపాదనలపై కేబినెట్‌ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన నాలుగు బిల్లులపై పలు వివరణలను కోరుతూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపారు. గవర్నర్‌ అడిగిన వివరణలకు సమాధానమిచ్చే విధంగా ఈ బిల్లుల్లో మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదాలపై చర్చించే ప్రతిపాదనను కేబినెట్‌ ఎజెండాలో చేర్చారు. ఆగస్టు 3 నుంచి చేపట్టే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular