Delimitation In India: మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. ఎంఐఎం, కొన్ని పార్టీలు మినహా మిగతా రాజకీయ పార్టీలు మొత్తం ఈ బిల్లును స్వాగతిస్తున్నాయి. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఘనత మొత్తం తమదే అని బిజెపి ప్రచారం చేసుకుంటున్నది. కాంగ్రెస్ కూడా తమ హయాంలోనే ఈ బిల్లు తెరపైకి వచ్చిందని చెబుతోంది.. ఇక తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఆందోళన వల్లే మహిళా బిల్లు ఆమోదం పొందిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.. సరే రాజకీయ పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా ఆలోచిస్తాయి కాబట్టి ప్రస్తావన కొంచెం పక్కన పెడితే.. బిల్లుకు సంబంధించి డీ లిమిటేషన్ అనే పదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
మహిళా రిజర్వేషన్ల బిల్లుతోపాటు వినిపిస్తున్న పదం డీ లిమిటేషన్. పెద్దకాలంగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల బిల్లు ఆమోదం సులభమైనప్పటికీ దాని అమలు డీ లిమిటేషన్ పైనే ఆధారపడి ఉంది. దేశంలో, రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియే డీ లిమిటేషన్. సులభంగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీలో సీట్లు ఉండేలా చూసే ప్రక్రియ. అంటే దీని ప్రకారం మారుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసలు బాటు ఇది. రాజ్యాంగంలోని 82 వ అధికరణం ప్రకారం దీనిని చేపడతారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనగణన తర్వాత ఇది జరగాలి. డీ లిమిటేషన్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సారథ్యం వహిస్తారు. ఇది తాత్కాలిక కమిషన్ కాబట్టి శాశ్వత ఉద్యోగులు అంటూ ఇందులో ఉండరు. ఎన్నికల కమిషన్ సిబ్బందినే వినియోగించుకుంటారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల జనాభా గణాంకాలను సేకరించి, అధ్యయనం చేసి ఈ కమిషన్ తన ప్రాథమిక నివేదికను సమర్పిస్తుంది. ఇందుకు కనీసం ఐదు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. దీనిని గెజిట్లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని పరిశీలించిన తర్వాత తుది నివేదిక ఇస్తారు. ఒక్కసారి డీ లిమిటేషన్ కమిషన్ తుది నివేదిక ప్రచురించిందంటే దాన్ని పార్లమెంట్ కూడా మార్చలేదు. దానిని ఏ కోర్టులోనూ సవాల్ చేయడానికి లేదు. డీ లిమిటేషన్ ఏం చెబితే అదే చట్టం అవుతుంది.
మొదట డీ లిమిటేషన్ 1952 లో జరిగింది. దీని ద్వారా అప్పటి జనాభా ఆధారంగా లోక్సభకు 494 నియోజకవర్గాలుగా నిర్ణయించారు. 1963 లో రెండవ డీ లిమిటేషన్ కమిషన్ ఈ సంఖ్యను 522 కు పెంచింది. 1973లో లోక్ సభ సీట్లు 543 కు పెరిగాయి. తర్వాత జనాభా పెరిగినప్పటికీ మళ్లీ డీ లిమిటేషన్ లో భాగంగా సీట్లను పెంచలేదు. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా డీ లిమిటేషన్ ప్రక్రియను 25 సంవత్సరాల పాటు నిలిపి వేసింది. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించేలా రాష్ట్రాలకు వెసలు బాటు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001 లో వాజ్ పేయి ప్రభుత్వం కూడా అదే కారణం చెబుతూ మరో పాతిక సంవత్సరాల దాకా అంటే 2026 దాకా డీ లిమిటేషన్ కు దారులు మొత్తం మూసేసింది. మధ్యలో అంటే 2002లో జస్టిస్ కుల్ దీప్ సారధ్యంలోని డీ లిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేసినప్పటికీ అది కేవలం నియోజకవర్గం మార్చడానికి మాత్రమే పరిమితమైంది. అది సంఖ్యను కూడా పెంచలేదు.
దేశంలో, రాష్ట్రాల్లో ఉన్న చట్టసభల సీట్ల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించిందే. సాధారణంగా అయితే 2026 లో గడువు ముగియగానే డీ లిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టే వీలు ఉండేది.. కానీ 10 సంవత్సరాలకు ఒకసారి చేపట్టే జనగణన 2021 లో కోవిడ్ కారణంగా చేపట్టలేదు.. 2024 ఎన్నికల తర్వాత జన గణన మొదలవుతుందని అంటారు. ఇదంతా పూర్తయి, నివేదికలు సిద్ధమవువడానికి మూడు లేదా నాలుగు సంవత్సరాలు పట్టవచ్చు అని ఒక అంచనా. ఆ తర్వాత డీ లిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతా సవ్యంగా సాగితే 2029 తర్వాతే కొత్త నియోజకవర్గాలతో పాటు మహిళల రిజర్వేషన్లు అమలులోకి రావచ్చు. మారిన జనాభా ప్రకారం పార్లమెంటులో లోక్సభ సీట్లు 888 దాకా, రాజ్యసభ సీట్లు 245 నుంచి 384కు పెరుగుతాయి. అయితే ఇది గొడవకు దారి తీసే అవకాశం ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభ సీట్లు 80 నుంచి 143 కు, బీహార్ సీట్లు 40 నుంచి 79 కి పెరగవచ్చు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లో సీట్లు 17 దాకా తగ్గొచ్చు. దీనివల్ల హిందీ రాష్ట్రాల ప్రాబల్యం పార్లమెంటులో పెరుగుతుంది. దీనిపై ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల అధినేతలు కేంద్రం వద్ద తమ అభ్యంతరాలు తెలిపారు.. ఈ నేపథ్యంలో డీ లిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ఎలా కొనసాగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.