CM Jagan: వైసీపీ అధిష్టానం సూచనల మేరకు ప్రజల్లోకి వెళ్తున్న ఆ పార్టీ నాయకులకు చాలా చోట్ల వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. అంతా సర్దుబాటు చేసుకొని ఎన్నికల ప్రచారంలో దిగేందుకు జగన్ సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ప్రజల్లోకి రావాల్సి ఉండగా, మరెందుకో వెనుకాడుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన జనంలోకి వస్తే ఏం జరుగుతుంది? ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బట్టబయలవుతుందా? లేదా గుంభనంగా ఉంటూనే తమ పని తాము చేసుకుపోతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో నార్పల నుంచి పుట్టపర్తికి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఆ సమయంలో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులను సీఎం కాన్వాయ్ వస్తుందని తెలుసుకొని పరిగెత్తుకు వచ్చారు. సాధారణంగా ముఖ్యమంత్రి ఇటువైపునగా వెళ్తున్నారంటే ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. తమ బాధలు చెప్పుకోవాలనే ఆతృత ఉంటుంది. అక్కడ కూడా అదే జరిగింది. ముఖ్యమంత్రితో తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వారందరినీ అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది లాగి పడేశారు. సమస్యలు విన్నవించుకునేందుకు వస్తే ఇలా చేస్తారా అన్న ఆగ్రహం వారిలో కనబడింది.
వీరందరూ ఒకరకంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వ బాధితులే. ఒక్క ధర్మవరంలోనే కాదు రాష్ట్రమంతా ఇలాంటి బాధితులు ఉన్నారు. నవరత్నాలను అర్హులదరికీ అందజేస్తున్నామని డప్పుకొట్టుకుంటున్న ప్రభుత్వానికి, అర్హత ఉన్నా లబ్ధి కోల్పోయిన వారెందరో ఉన్నారు. వీరందరికి సరైన వేదిక దొరికితే ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. ఆక్రోశాన్ని బయటకు వెళ్లగక్కలేక వైసీపీ నేతలపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. పథకాలు ఇచ్చేందుకు ఉన్న నిబంధనల కంటే, నిలిపివేసేందుకు ఉన్న కారణాలు విచిత్రంగా ఉంటున్నాయి.
కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని, ఫోర్ వీలర్ ఆన్ లైన్ లో చూపుతుందని, రెండు మూడు మీటర్లు ఆధార్ కార్డుకు చూపుతున్నాయని కారణాలను చూపుతూ పథకాలను నిలిపివేస్తున్నారు. వాస్తవానికి అవన్నీ లేకపోయినా, ఎక్కడో జరిగిన పొరపాటు వల్ల పింఛన్లు, అమ్మఒడి, రైతు భరోసా వంటి ఎన్నో పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని వర్గాలు వైసీపీపై గుర్రుగా ఉన్నాయి. ఇవే కారణాలు ఇంటింటికి వెళ్తున్న వైసీపీ నేతలకు ప్రశ్నలు రూపంలో ఎదురవుతున్నాయి. అందుతున్న పథకాలు కూడా నిలిపివేస్తారేమోనని భయంతో కొంతమంది సైలెంటుగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ జనంలోకి వస్తే రిసీవింగ్ ఎలా ఉంటుందనడంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.