CM KCR: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే గొప్ప నాయకుడు, మంచి సీఎం, డైనమిక్ లీడర్ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పట్టు వదలని విక్రమార్కుడు. కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్రమంగా ఆయన ఖ్యాతీ క్షిణిస్తోంది. తెలంగాణ ప్రజల్లో ఆయనకు ఆధరాభిమానాలు తగ్గిపోతున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఇవన్నీ వాస్తవాలు అని తేలుతాయి. ఇటీవల విడుదలైన సీ ఓటర్ సర్వే కూడా దీనిని రుజువు చేసింది.

ఆదరణ తగ్గడానికి కారణాలేంటి ?
సీఎంకు ఆదరణ తగ్గడానికి చాలా కారణాలున్నాయి. ఒకప్పుడు సీఎం కేసీఆర్ అంటే ప్రజల్లో ఓ గట్టి నమ్మకముండేది. ఆయన తప్ప తెలంగాణకు మరే నాయకుడు సీఎంగా సరిపోరనే అభిప్రాయం ఉండేది. అధికారం చేపట్టిన మొదటి రెండు, మూడేళ్లు ఆయన తీసుకునే చర్యలు కూడా అలాగే ఉండేవి. ఆయన ప్రతీ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదించేవారు. గౌరవించేవారు. సీఎం కేసీఆర్ ఏం చేసినా ప్రజల మేలు కోసమే చేస్తారనే అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో కనిపించేది. కానీ గత రెండు, మూడేళ్లు నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేసీఆర్ చూపిస్తున్న కోపం, హుజూరాబాద్ ఎన్నికల కోసం తీసుకొచ్చిన పథకాలు, అక్కడ జరుగుతున్న పనులు మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తోంది. అలాగే మొదట్లో కరోనాను తేలికగా తీసుకోవడం, కేవలం ప్యారాసిటమాల్ ట్యాబ్లెట్ తోనే కరోనాను తరిమికొట్టవచ్చనడం వంటివి కొంత ప్రజల్లో ఆదరణ తగ్గేలా చేశాయని చెబుతున్నారు.
సీఎం ముందున్న దారులేంటి ?
సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో కొంత విశ్వాసం తగ్గిందనడం కాదనలేని సత్యం. దీనికి తోడు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కూడా సీఎంపై కొంత ఆదరణ తగ్గేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ నుంచి, ఫాం హౌజ్ నుంచే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారనే భావనను ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ఈ విషయంలో అవి కొంత వరకు సక్సెస్ అయ్యాయి. దీంతో ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత ఏర్పడింది. అయితే సీఎం కేసీఆర్ ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి చాలా చర్యలే తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం కొన్ని వర్గాల ప్రజలే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే పాలనలో కూడా అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి. అయితే సీ ఓటర్ సర్వే నిర్వహకులు కూడా సీఎం కేసీఆర్‌కు ఓ సూచన చేశారు. మంత్రి కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. అది టీఆర్ఎస్ కు, కేసీఆర్‌కు మంచి చేస్తుందని చెప్పింది. మరి ఆ సూచనను ఆయన పాటిస్తారా ? లేక ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.