Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోరు పెంచారు. ఇప్పటిదాకా హుజూరాబాద్ లో అడుగుపెట్టని రేవంత్ రెడ్డి లేట్ గానైనా లేటెస్ట్ గా ఎన్నికలకు వారం రోజుల ముందు హుజూరాబాద్ గడ్డపై అడుగుపెట్టి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు మద్దతుగా ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బల్మూరి వెంకట్ ను హుజూరాబాద్ కు స్థానికేతరుడు అన్న మంత్రి కేటీఆర్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
బల్మూరి వెంకట్ ను స్థానికేతరుడు అన్న కేటీఆర్.. సిరిసిల్లకు స్థానికేతరుడు కాదా? అని ప్రశ్నించారు. సిద్దిపేటకు హరీష్, గజ్వేల్ కు కేసీఆర్ స్థానికేతరుడే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు.. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కు అసలు లొల్లి ఎందుకు వచ్చిందనే దానిపై
హాట్ కామెంట్స్ చేశారు.
కేసీఆర్ కు, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కు పంపకాల్లో తేడాతోనే గొడవలు వచ్చాయని.. ఈ గొడవలే ఈటల రాజీనామాకు కారణమయ్యాయని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోందన్నారు. దళితబంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదని.. అభ్యర్థులు లోకల్,నాన్ లోకల్ అంటున్నారని విమర్శించారు.
ఇక మరో సంచలన విషయాన్ని కూడా చెప్పి దుమారం రేపారు. స్వయంగా తెలంగాణ డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని.. నర్సింగరావు డీజీపీపై.. వేణుగోపాల్ రావు మాపై నిఘా పెట్టారని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేరే పార్టీలో చేరొచ్చని.. ఆయన సామాజికవర్గ అధికారులను వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మొత్తంగా రేవంత్ రెడ్డి రాజేసిన ఈ మాటల మంటలు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి అగ్గి పుట్టిస్తున్నాయి.