UP Election 2022: ఇప్పుడు దేశం మొత్తం యూపీ దిక్కు చూస్తోంది. త్వరలోనే ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికార బీజేపీలో జరుగుతున్న పరిణామాలు దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటున్నాయి. అధికార పార్టీ నుంచి ఎస్పీలోకి వలసలు పెరగడం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో కేంద్ర నాయకత్వం అలెర్ట్ అయిపోయింది. వెంటనే ప్రధాని నరేంద్రమోడీ రంగంలోకి దిగిపోయారు.
ఈ రోజు ఆయన తన సొంత నియోజకవర్గం అయిన వారణాసి నేతలతో సమావేశం నిర్వహించారు. నమో యాప్ ద్వారా వారితో కేవలం ఆడియో కాల్ ద్వారా వారికి కొన్ని సూచనలు చేశారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయడంలో కార్యకర్తలు కీలకంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వాన్ని మరోసారి నిలబెట్టాలంటూ కోరారు. మహిళా సంఘాలకు మరింత చేరువ కావాలంటూ చెప్పుకొచ్చారు.
Also Read: ఆటో నడుపుకోవాలని హేళన చేశారు.. చేదు అనుభవంపై కన్నీళ్లు పెట్టుకున్న బౌలర్
సిరాజ్..
అలాగే ఈ మీటింగ్ లో వారిక మరో కీలకమైన సూచన చేశారు. అదేంటంటే.. ప్రతి పోలింగ్ బూత్ లో డొనేషన్ క్యాంపులు నిర్వహించాలంటూ ఆదేశించారు. వీటి ద్వారా వీలైనంత ఎక్కువ విరాళాలు సేకరిస్తే.. ఆ మొత్తాన్ని ఎన్నికల నిర్వహణ కోసం వాడుకోవచ్చంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇచ్చే వారి దగ్గరి నుంచి ఎక్కువ మొత్తంలో కాకుండా చిన్న మొత్తంగానే విరాళాలు సేకరించాలంటూ వెల్లడించారు.
అయితే ఇలా ఎక్కువ మంది నుంచి డబ్బులు సేకరిస్తే.. అది తమకు పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇక ఈ డొనేషన్ క్యాంపుల ద్వారా డబ్బులే కీలకంగా పనిచేయకుండా.. మందిని సమకూర్చుకోవడం కోసం వాడుకోవాలని చెప్పారు నరేంద్ర మోడీ. పార్టీ అభిమానులను ఏకతాటి మీదకు తీసుకురావాలని, ఇందులో సీనియర్లు కీలకంగా పనిచేయాలన్నారు. వ్యవసాయ రంగంతో పాటు కాశీ విశ్వనాథ్ ధామ్, మహిళా సాధికారత లాంటి కీలక మైన వ్యవస్థల కోసం తాము చేసిన పనిని ప్రచారం చేయాలన్నారు. ఇక యూపీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 దాకా ఏడు విడతల్లో ఎలక్షన్లు జరగనున్నాయి.
Also Read: కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు రద్దు చేసుకున్నాడు? కారణం అదేనా?