YCP: వచ్చే ఎన్నికల్లో గెలుపు పై వైసీపీలో ధీమా కనిపిస్తోంది. అందుకే వై నాట్ 175 అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చింది. కానీ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. గెలుపు పై ధీమా ఉంటే అభ్యర్థుల మార్పు ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో అమలు చేస్తున్నామని.. ప్రజలు తమ వెంటే ఉన్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సానుకూలత కనిపిస్తున్నా, పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రం స్పష్టమైన ప్రతికూలత కనిపిస్తోంది. గెలుపు పై తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప, చిత్తూరు నగరాలుగా గుర్తింపు పొందాయి. ఇక వందలాది పట్టణాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. సంక్షేమ పథకాలను అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి ప్రజలు జగన్ సర్కార్ ను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. మరోసారి అధికారంలోకి రాకూడదని భావిస్తున్నారు. అయితే పట్టణాలు ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు కూడా భయపడుతున్నారు. పట్టణాల్లో వచ్చే వ్యతిరేకతను గ్రామాల్లో అధిగమిస్తామని చెబుతున్నారు. అయినా లోలోపల మాత్రం వారిని భయం వెంటాడుతోంది.
అయితే వైసిపి నగరాలు, పట్టణాలపై ఫోకస్ పెట్టింది. ఏడు కార్పొరేషన్ల తో పాటు 17 మున్సిపాలిటీల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వార్డు మెంబర్లకు ప్రత్యేకంగా టాస్క్ ఇచ్చింది. ఇన్చార్జిలుగా నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వలంటీర్లు, గృహసారథులు, సమన్వయకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.ఇప్పుడు వారికి మునిసిపల్ పాలకవర్గాలు తోడయ్యాయి. ప్రత్యేక వ్యూహంతో వైసిపి ముందుకు సాగుతోంది. వారికి ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో పట్టణాల్లో సైతం వైసీపీకి మెజారిటీ దక్కేలా పావులు కదుపుతోంది. అటు అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి వంటి వాటి విషయంలో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను సైతం నగరాలు, పట్టణాల్లో ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ రెండు నెలలు కీలకం కాబట్టి.. వీలైనంతవరకు ప్రజల్లో ఉండాలని పార్టీ నుంచి సూచనలు వచ్చాయి. మొత్తానికైతే నగరాలు, పట్టణాల్లో వ్యతిరేకత ఉన్నట్లు వైసిపి హై కమాండ్ గుర్తించింది. అయితే దానికి విరుగుడు చర్యలు ఎంతవరకు పని చేస్తాయో చూడాలి.