Homeజాతీయ వార్తలుTelangana BJP: తెలంగాణ బీజేపీ ఇంతటి దురావస్థకు కారణమేంటి? ఎవరి తప్పు?

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఇంతటి దురావస్థకు కారణమేంటి? ఎవరి తప్పు?

Telangana BJP: తెలంగాణలో ఆరు నెలలుగా అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బీజేపీకి ఎన్నికల సమయంలో వలస నేతలు షాక్‌ ఇస్తున్నారు. క్రమశిక్షణ, సిద్ధాంతానికి కట్టుబడే పార్టీగా జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలో చేసిన తప్పునే తెలంగాణలోనే అదే విధానం అనుసరించింది. వలస నేతలను నమ్ముకుని నిండా మునిగింది.

అధికారం కోసం వలసను ప్రోత్సహించి..
రెండేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నించింది. ఇందు కోసం అక్కడి అధికార, విపక్ష పార్టీలను పార్టీలోకి చేర్చుకుంది. సిద్ధాంతం పక్కన పెట్టి.. వలసలకు తలుపులు తీసింది. దీంతో అప్పటి వరకు బీజేపీకి శత్రువుగా ఉన్న కమ్యూనిస్టు, కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరారు. ఈ క్రమంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ బీజేపీ అరాచకాన్ని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఈ క్రమంలో అల్లర్లు హింస చలరేగాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో కమలం నేతలు తృణమూల్‌ను ఓడించే వరకు వచ్చారు. కానీ లక్ష్యం చేరడంలో వెనుకబడ్డారు. దీంతో మళ్లీ తృణమూల్‌ సీఎం అయ్యారు.

తెలంగాణలోనూ అదే ఫార్ములా..
దక్షిణాదిన పాగా వేయాలన్న లక్ష్యంతో తెలంగాణలోనూ బీజేపీ చేరికలకు డోర్లు తెరిచింది. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ మరింత బలంలో అధికారం చేపట్టింది. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వివిధ పార్టీల అభ్యర్థులు బీజేపీ చెంతకు చేరారు. ఇక బండి సంజయ్‌ అధికార పగ్గాలు చేపట్టాక బీజేపీ తెలంగాణలో తారా జువ్వలా దూసుకుపోయింది. అదే సమయంలో కాంగ్రెస్‌ రోజురోజుకూ బలహీనపడుతూ వచ్చింది. ఈ క్రమంలో అధికార బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. బీజేపీ ఎదుగుదల, బండి సంజయ్‌ దూకుడు చూసిన చాలా మంది నాయకులు కమలం గూటికి వచ్చారు. అయితే పశ్చిమ బెంగాల్‌ తరహాలోనే ఇక్కడ కూడా నేతల బ్యాక్‌గ్రౌండ్, గతంలో వారి చరిత్ర, బలాలు, బలహీనతలు, సిద్దాంతానికి కట్టుబడే తత్వం గురించిపట్టించుకోలేదు. అందరినీ స్వాగతించింది.

గ్రూపు రాజకీయాలు..
తెలంగాణలో గ్రూపు రాజీకయాలు అంటే కాంగ్రెస్‌ అనే విధంగా ఉండేది. కానీ వలస నేతల రాకతో బీజేపీలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏర్పడింది. వల సేతలు ఎవరికి వారు పార్టీలో పట్టు, బలం పెంచుకునేందుకు, తమ కోటరీ ఏర్పాటు చేసుకునేందుకు గ్రూపులను ప్రోత్సహించారు. తమకంటూ వర్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది పూర్తిగా బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా ఉండే బీజేపీలో వలస నేతల గ్రూపు రాజకీయాలు పార్టీ ప్రతిష్టకు మచ్చగా మారాయి.

చివరకు అధిష్టానానికే అల్టిమేటం..
ఇక బీజేపీలో ఈ గ్రూపు రాజకీయాలు ఎంత వరకు వెళ్లాయంటే.. ఏకంగా అధిష్టానానికే అల్టిమేటం జారీ చేసే పరిస్థితి వరకు వచ్చింది. మరోవైపు అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో అధిష్టానం పార్టీ లైన్‌ దాటి వలస నేతలకు తలొగ్గారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీకి బలమైన అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌కు అనుకూలుడిగా ముద్ర ఉన్న కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించడం కూడా మరో రాంగ్‌ స్టెప్‌గా మారింది.

తప్పెవరిది?
ఈ క్రమంలో తెలంగాణలో ఒకదశలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ నేటి పరిస్థితికి తప్పెవరిది అంటే.. పూర్తిగా అధిష్టానందే అని చెప్పవచ్చు. పశ్చిమబెంగాల్‌లో భంగపడినట్లే.. తెలంగాణలో అదే ఫార్ములాను అనుసరించి మరోమారు కమలం పార్టీ భంగపడింది. సిద్ధాంతానికి కట్టుబడనే నేతలను కాదని, వలస నేతలక పదవులు ఇవ్వడం, గెలుపు ఓటములుతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసే నేతలను పక్కన పెట్టడం మూలంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాలన్నీ బూమరాంగ్‌ అయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. దీంతో వలస వచ్చిన నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. బయటకు వచ్చాక వాపును చూసి బలుపనుకున్నామని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా చేరికలపై దృష్టిపెట్టకుండా, పార్టీ కోసం కష్టపడే నేతలను బలోపేతం చేయడం, సిద్ధాంతానికి కట్టుబడే పార్టీగా ఉన్న గుర్తింపును కొనసాగించడం, నేతలను ప్రజల్లో పనిచేసే స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికైనా బీజేపీ బలపడుతుందని భావిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version