KCR-Thummala : ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఇక లాంచనమే. ఇది అధికార భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని ఎదురుదెబ్బ.. ముఖ్యంగా ఖమ్మం లాంటి సున్నితమైన జిల్లాలో భారత రాష్ట్ర సమితికి పూడ్చలేని లోటు.. ఇది క్రమక్రమంగా తెలంగాణ మొత్తం విస్తరించక ముందే కేసీఆర్ చకచకా పావులు కలిపారు.. మరోవైపు పొంగులేటి శ్రీనివాస రెడ్డి బాటలోనే తుమ్మల నాగేశ్వరరావు కూడా నడుస్తారని అప్పట్లో చర్చ జరిగింది.. వీటికి బలం చేకూరుస్తూ ఆయన వాజేడు, బారు గూడెం లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఒకరకంగా తాను కూడా పార్టీ మారతాననే సంకేతాలు ఇవ్వకుండా… అవే అర్థం వచ్చే మాటలు మాట్లాడారు.. దీంతో కెసిఆర్ ఆత్మ రక్షణలో పడ్డారు.. వెంటనే హరీష్ రావును రంగంలోకి దింపారు.

సయోధ్య కుదుర్చినట్టేనా?
హరీష్ రావుకు, తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య సయోధ్య ఉంది.. ఇద్దరు కూడా ఎప్పటినుంచో మిత్రులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో తుమ్మల, హరీష్ పిచ్చాపాటిగా మాట్లాడుకునేవారు. గతంలో హరీష్ రావు ఖమ్మం పలుమార్లు వచ్చినప్పుడు తుమ్మల ఇంట్లోనే బస చేశారు. తుమ్మల కూడా హరీష్ రావు వ్యక్తిత్వాన్ని బాగా ఇష్టపడతారు.. ఈ క్రమంలో ఖమ్మం సభ నేపథ్యంలో హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు.. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లారు.. అక్కడ తుమ్మల, హరీష్ రావు దాదాపు మూడు గంటలసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత తుమ్మల చిరునవ్వుతో బయటకు వచ్చారు.. ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందనేది ముంజేతి కంకణమే అయినప్పటికీ… విలేకరులకు మాత్రం తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో సీనియర్ మంత్రి కావడంతో తాను గౌరవప్రదంగా కలిశానని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
ఏం ఇస్తానని చెప్పారు
2018 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం లో ఓడిపోయారు.. అప్పుడు పాలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ నుంచి భారత రాష్ట్ర సమితిలో చేరారు. కెసిఆర్, కేటీఆర్ కు అత్యంత విశ్వాస పాత్రుడైన వ్యక్తిగా ఎదిగారు. ఇదే క్రమంలో క్రెడాయ్ లో కందాల ఉపేందర్ రెడ్డి కి ఉన్న పరిచయాల ద్వారా కేటీఆర్ కు మరింత దగ్గర అయ్యారు.. 2023లో పాలేరులో మళ్లీ పోటీ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఇది తెలిసే తుమ్మల నాగేశ్వరరావు భారత రాష్ట్ర సమితి పార్టీకి దూరంగా ఉండుకుంటూ వస్తున్నారు. అయితే పొంగులేటి పరిణామాన్ని ఊహించని కెసిఆర్.. అప్పట్లో కందాలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో దేశంలో చక్రం తిప్పాలని కలలు కంటున్న కెసిఆర్ కు పొంగులేటి పరిణామం పంటి కింద రాయిలా మారింది. ఆ తర్వాత హరీష్ ను రంగంలోకి దింపి తుమ్మలను బుజ్జ గించి తన ఫోల్డ్ లోకి తెచ్చుకున్నాడు. అయితే తుమ్మలకు పాలేరు ఇస్తారనే హామీ ఇవ్వడంతో నే ఆయన చల్ల బడ్డారని టాక్. అందుకే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేస్తున్నట్టు సమాచారం.. గతంలో కూడా తుమ్మలను ఇదేవిధంగా వాడుకున్న భారత రాష్ట్ర సమితి.. మరి ఈసారైనా మాట నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.