Telangana Secretariat Fire: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయంలో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది.. గ్రౌండ్ ఫ్లోర్లో అంటుకున్న మంటలు దట్టంగా అలముకున్నాయి.. దీనివల్ల ఆరో అంతస్తు వరకు పొగలు వ్యాపించాయి.. దీనిని కవర్ చేసేందుకు మీడియా వెళితే పోలీసులు అడ్డుకున్నారు.. పైగా ప్రభుత్వం కూడా దీనిని మాక్ డ్రిల్ గా కప్పి పుచ్చే ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడింది.. కానీ ఇప్పుడు ఉన్నవి సోషల్ మీడియా రోజులు కనుక ప్రభుత్వం ఎందరి నోర్లు మూయగలదు? తెల్లవారుజామున అంత దట్టంగా మంచు కురుస్తుంటే పొగలు ఆ స్థాయిలో వచ్చాయంటే ప్రమాదం తీవ్రత అర్థం చేసుకోవచ్చని ఆర్కిటెక్ట్ నిపుణులు అంటున్నారు.. అంతేకాదు మంటలు ఆర్పేందుకు 11 ఫైర్ ఇంజన్లు వినియోగించారు అంటే భారీ ప్రమాదమే జరిగిందని అర్థం అవుతోంది.
నూతన సచివాలయాన్ని ఈనెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభోత్సవానికి సమయం తక్కువ ఉండటం, చేయాల్సిన పనులు ఎక్కువగా ఉండటంతో నిర్మాణ కంపెనీతోపాటు వర్కర్లపై పని ఒత్తిడి పెరిగింది. లోపల విద్యుత్, ప్లైవుడ్, సెంట్రల్ ఏసి పనులతో పాటు ప్లాస్టిక్, పాలిథిన్ షీట్స్ వంటి పనులు జరుగుతున్నాయి. వీటితోపాటు మరోవైపు వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నడంతో చెక్కపొట్టుకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. హడావిడిగా పనులు చేస్తూ నిబంధనలను పాటించకపోవడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని పలు పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నప్పటికీ అగ్ని ప్రమాదం జరగటం పట్ల భారతీయ రాష్ట్ర సమితి నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు ముఖ్యమంత్రి పర్యటించిన ప్రతిసారీ సూచనలు చేస్తున్నారు.. ఇంకా పనులు ఎందుకు కావడం లేదు అంటూ సంబంధిత మంత్రిని ప్రశ్నించడంతోపాటు పనులపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో దీనిపై విచారణకు ఆర్ అండ్ బి, సాధారణ పరిపాలన విభాగం, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో కూడిన ఒక అంతర్గత కమిటీని నియమించింది.. కమిటీ విచారణ జరిపి నివేదిక ఇవ్వనుంది. కాగా సచివాలయంలో అగ్నిప్రమాదం జరగటం, దట్టమైన పొగలు కమ్ముకోవడం పై అగ్నిమాపక సిబ్బంది, ఆర్ అండ్ బి మంత్రి, సంబంధిత అధికారులు చేసిన వ్యాఖ్యలకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. ఘటనపై స్పందించిన అధికారులు మాకు డ్రిల్ నిర్వహించామని అందుకే పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయని చెబుతుంటే… అసెంబ్లీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పడం గమనార్హం. ప్రమాదంపై భిన్న వ్యాఖ్యలు వినిపించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు పరుగులు తీసి ఇతరులు, మీడియాను లోపలికి రాకుండా అడ్డుకున్న పోలీసులు.. అది పెద్ద ప్రమాదం ఏమి కాదని చెప్పడం గమనార్హం.. ఇంత జరిగినప్పటికీ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.. మరోవైపు అగ్ని ప్రమాదం సచివాలయం భవనం వెనుకవైపున జరగడంతో అక్కడకు ఫైర్ ఇంజన్లు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేపడతామని చెప్పుకునే నిర్మాణ సంస్థ.. కనీసం ఫైర్ ఇంజన్లు చేరుకునేందుకు అనుబోయిన మార్గాన్ని కూడా ఉంచలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం… కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం పట్ల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.