Verity Wedding Cards: శుభలేఖ.. వివాహ బంధానికి ప్రతీక, బంధు మిత్రులకు అందించే సమాచార పత్రిక. ఆడ, మగ ఇద్దరి మధ్య ఏర్పాడే వివాహ బంధానికి సూచిక. రెండు కుటుంబాలను కలుపుతుంది. వివాహం పేరుతో అందరిని ఆహ్వానించడానికి ఉపయోగించేదే ఈ శుభలేఖ. హిందూ సంప్రదాయంలో దీనికి ప్రత్యేకత, పవిత్రత ఉంది. అయితే వివాహం అయ్యే వరకే దీని విలువ. వివాహం తర్వాత వ్యర్థంగా పడేస్తుంటాం. కానీ ఓ ఆలోచన శుభలేఖలను మొలకెత్తిస్తోంది. ప్రకృతికి, పర్యావరణానికి సహకరిస్తోంది. శుభలేఖలలో తులసి విత్తనాలు పెట్టి పెళ్లికి ఆహ్వానించడం ఈ శుభలేఖల ప్రత్యేకత. శుభలేఖ తీసుకున్న వారు పెళ్లి అయిన రెండు మూడు రోజుల తర్వాత మట్టి పాత్రలో గానీ ఏదైనా పూల కుండీలో పెట్టి నీళ్లు పోస్తే శుభలేఖ స్ప్రెడ్ అయిపోయి నీటిలో కరిగిపోయి అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి.

వ్యర్థానికి అర్థం చెప్పేలా..
ఇంత మంచి ఆలోచన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మంచాల జ్ఞానేందర్‌కు వచ్చింది. తన కూతురు వివాహానికి శుభలేఖ అచ్చు వేయించడానికి నూతన పద్ధతిలో ఆలోచించాడు. ప్రకృతికి హాని చేయకూడదనే ఆలోచనతో జ్ఞానేందర్ ఈ మట్టిలో కరిగిపోయే రకమైన శుభలేఖను ప్రత్యేకంగా తయారు చేయించాడు. అందులో ప్రత్యేకంగా తులసి విత్తనాలను ఉంచారు. ఈ పత్రికను పూల మొక్క, కుండీలో పెట్టి నీళ్లు పోస్తే అది తడిసి పూర్తిగా నానిపోయి స్ప్రెడ్ అయిపోతుంది. అందులోని విత్తనాలు మొలకెత్తి తులసి మొక్కలుగా బయటకు వస్తాయి.
తన కుమార్తె వివాహానికి ప్రత్యేక ఆహ్వానం..
జ్ఞానేందర్ తమ పెద్ద కుమార్తె డాక్టర్ శరణ్య వివాహానికి పర్యావరణానికి హాని కలుగకుండా శుభలేఖలు ఉండాలని ఈ కొత్త ఆలోచన చేశారు. వివాహనంతరం శుభలేఖ వ్యర్థం కాకుండా ఉపయోగపడే విధంగా ఉండేందుకే మూడు నెలలుగా ఆలోచించి కార్డును ప్రత్యేకంగా తయారు చేయించామన్నారు. అహ్మదాబాద్‌లో మూడు నెలల క్రితం రెండు వేల కార్డులు ప్రింట్ చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 24 జరిగే తన కుమార్తె వివాహానికి అందరూ తప్పకుండా రావాలని కోరుతున్నారు.

ట్రస్టు ద్వారా సేవలు..
జ్ఞానేందర్ మంచాల శంకరయ్యగుప్తా చారిటబుల్ ట్రాస్ట్ ద్వారా జ్ఞానేందర్ పదేళ్లుగా ప్రజాసేవలో ఉన్నారు. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, సిరిసిల్ల, వేములవాడ, వనపర్తి, హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉచితంగా స్వర్గయాత్ర రథాలు, వాటర్ ట్యాంకర్లు, ఎవరైన ఆనాథలు చనిపోతే 50 మందికి సరపడా భోజనం అందిస్తున్నారు. 4 వేల భగవత్‌గీత పుస్తకాలను పంపిణి చేశారు. పక్షల కోసం వాటికి వాటర్, అవి తీసుకునే ఆహారం కోసం అనేక రకాల మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారు.