Bandi Sanjay : ఏపీ బీజేపీలో కీలక పరిణామం. పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా బండి సంజయ్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ నూతన అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురందేశ్వరి పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ఇన్చార్జి నియామకంపై హై కమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నెలరోజుల కిందటే తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను హైకమాండ్ మార్చింది. తెలంగాణ పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకున్న పరిణామాలతో బండి సంజయ్ ని తప్పించింది. ఏపీలో సోము వీర్రాజుని పక్కన పెట్టి పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణలో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కు హై కమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయనకు మరో కీలక బాధ్యత అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ ఇన్చార్జిగా ఉన్న సునీల్ దేవదర్ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని బండి సంజయ్ తో భర్తీ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సీరియస్ గా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో బిజెపి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. జనసేన మిత్రపక్షంగా బిజెపి కొనసాగుతోంది. అటు వైసీపీతో స్నేహాన్ని కొనసాగిస్తుంది. తెలుగుదేశం పార్టీ సైతం బిజెపితో స్నేహాన్ని కోరుకుంటుంది. ఈ తరుణంలో ఏపీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేయాలని హై కమాండ్ భావిస్తోంది. దీనికి సరైన నాయకత్వం అవసరమని.. అందుకే బండి సంజయ్ ని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం.
కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఏపీ బీజేపీ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉంటూనే..ఇన్చార్జిగా కొనసాగుతున్నారు.కానీ కొంతకాలంగా మురళీధరన్ ఏపీ వైపు చూడడం లేదు. బాధ్యతల నుండి తప్పించాలని కొద్దిరోజులుగా ఆయన కోరుతూ వస్తున్నారు. ఈ తరుణంలో సరైన వ్యక్తి కోసం బిజెపి హై కమాండ్ అన్వేషిస్తుంది. తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడైన బండి సంజయ్ అయితే.. ఏపీ రాజకీయాలకు సరిపోతారని.. దూకుడుగా వ్యవహరించే ఛాన్స్ ఉందని బిజెపి అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే రోజులు వ్యవధి లోనే బిజెపి అధిష్టానం సంజయ్ నియామక ప్రకటన చేసే అవకాశమున్నట్లు బిజెపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.