YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి రాష్ట్రంలో పార్టీ స్థాపించారు. ఆ పార్టీకి తండ్రి పేరు స్పురించేలా వైఎస్ఆర్‌టీపీ అని పేరు పెట్టారు. అన్ని వర్గాలను కలుపుకుపోయే విధంగా జెండా రూపొందించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఎంత వరకు నమ్మి, ఆధారిస్తారనే విషయంలోనే చాలా అనుమానాలున్నాయి.

తండ్రి, అన్న బాటలోనే పయనం
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అధికారంలోకి తీసుకువచ్చిన అంశాల్లో ముఖ్యమైనది పాదయాత్ర. ఇదే ఫార్ములాను అటు ఏపీలో వైఎస్ జగన్ అమలు చేసి అధికారం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి, అన్న చూపిన బాటలోనే షర్మిల కూడా ప్రయాణిస్తోంది. మూడు రోజుల క్రితం చేవేళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు షర్మిల. 400 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర చివరికి చేవెళ్లలోనే ముగియనుంది. తన తండ్రి పాదయాత్ర మొదలుపెట్టిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా తన ‘ప్రజాప్రస్థానం’ మొదలు పెట్టడం ఇక్కడ గమనార్హం.
అన్ని పార్టీలపై విమర్శలు..
టీఆర్ ఎస్ పాలనలో తెలంగాణ సంతోషంగా లేరని మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తోంది షర్మిల. అందుకే తాను రాజన్న రాజ్యం తీసుకురావడానికే తెలంగాణలో పార్టీ పెడుతున్నానని చాలా సార్లు ప్రకటించారు. ప్రజలు సుభిక్షంగా లేరని, వారు పాలనలో మార్పు కోరకుంటున్నారని చెబుతూ వస్తున్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా అన్ని పార్టీలపై ఆమె ఆరోపణలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను, కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టివేశారని విమర్శిస్తూ, తాను ఈ నియంతృత్వ, నిరంకుశ పాలనను అంతమొదించడానికే వచ్చానని తెలిపారు. తెలంగాణలో సమస్యలు లేకపోతే తాను ముక్కు నేలకు రాస్తానని, ఈ సవాల్‌ను కేసీఆర్, కేటీఆర్ స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పైనా, బీజేపీపైనా విమర్శలు గుప్పించారు శర్మిల. తనకు బ్లాక్ మెయిల్ చేయడం తెలియదని, ఓట్లను డబ్బులతో కొనలేనని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. అలాగే ఎప్పుడూ కేసీఆర్ అవినీతిపై ప్రశ్నించే బీజేపీ.. ఎందుకని విచారణ జరిపించడం లేదని విమర్శించారు. ఇలా అన్ని పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ మొదలైంది ఆమె పాదయాత్ర. అయితే ఈ విషయంలో రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తన రాజకీయ ప్రత్యర్థిని ఎంచుకోవడంలో క్లారిటీగా లేరని, తనకు ఇంకా రాజకీయంగా పూర్తి అవగాహన రాలేదని అంటున్నారు. ఎవరిపై విమర్శలు చేయాలో అనే అంశంపై తను సందిగ్ధంలో ఉన్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.