Sriharikota: దేశానికే తలమానికమైన నెల్లూరు షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో పోలీసుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.. ఇంతటి కీలకమైన కేంద్రంలో ఒక్కరోజులోనే ఒక కానిస్టేబుల్, ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదే తరహాలో మరో ముగ్గురు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. ప్రశాంతతకు ఆలవాలమైన షార్ లో భద్రత సిబ్బంది ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయ. శ్రీహరికోట లోని షార్ కేంద్రంలో భద్రతా దళాల యూనిట్ లో 947 మంది వరకు వివిధ స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్నారు.. వీరిలో 90 మంది దాకా మహిళలు ఉన్నారు.

షార్ కేంద్రంలో పెద్దగా పని ఒత్తిడి ఉండదు.. ఎప్పుడైనా ప్రయోగాలు జరిగినప్పుడు, వివిఐపీలు వచ్చినప్పుడు మాత్రమే హడావిడి ఉంటుంది. మిగతా సమయాల్లో పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. ఇక్కడ పనిచేసే భద్రత సిబ్బందిని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేస్తారు.. కొవిడ్ -19 నేపథ్యంలో రెండు సంవత్సరాలపాటు సాధారణ బదిలీలు జరగలేదు. గత ఏడాది అక్టోబర్లో వాటిని నిర్వహించిన నేపథ్యంలో 500 మంది వరకు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు..
వారి స్థానంలో కొత్తవారు వచ్చారు. ఎక్కువమంది కుటుంబానికి దూరంగా ఇక్కడి బ్యారక్ లలో నివాసం ఉంటున్నారు. వారిలో మనోవేదనకు గురవుతున్నారు.. కొంతమంది మానసిక వ్యాధులకు సంబంధించి మందులు వాడుతున్నారు. కొంతమంది స్థానిక వైద్యుల వద్ద అప్పుడప్పుడు చికిత్స చేయించుకుంటున్నారు.. ఇక నిన్న చింతామణి అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇతడికి తల్లిదండ్రులు లేరు. అన్నయ్య ఉన్నాడు. లేకున్నా బలవంతంగా పెళ్లి చేస్తుండటంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్ కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వీరిలో కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్కేజీ, మరో కుమార్తె చిన్న పాప. ఒక కుమార్తె దివ్యాంగురాలు. ఇతడి మృతి పైనా అనుమానాలు ఉన్నాయి. 2015 బ్యాచ్ కు చెందిన ఇతను శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో విధులు నిర్వహిస్తూ… గత ఏడాది నవంబర్లో బదిలీపై శ్రీహరికోటకు వచ్చారు.. ముంబైలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే క్రమశిక్షణ చర్యలకు గురైనట్టు సమాచారం. దీనిపై శాఖ పరమైన విచారణ కొనసాగుతోంది.. అప్పులు సైతం అధికంగా ఉన్న నేపథ్యంలో ఇతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా షార్ లో వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.. మానసిక వ్యాధులతో బాధపడే ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని షార్ అధికారులు నిర్ణయించారు.. మరోవైపు కొంతమంది ఉద్యోగులను వారి సొంత ప్రాంతాలకు దగ్గరలో బదిలీ చేయాలని యోచిస్తున్నారు.