రెండు రోజుల కిందటి వరకూ వైద్యారోగ్య శాఖ మంత్రిగా కొవిడ్ సమస్యల పరిష్కారంలో తలమునకలై ఉన్నారు ఈటల రాజేందర్. కానీ.. ఊహించని పరిణామాలతో నేడు మాజీ మంత్రి అయ్యారు. బహుశా ఇంత త్వరగా ఈ పరిస్థితి వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. మొత్తానికి టీఆర్ఎస్ అధిష్ఠానం ఆయన్ను మాజీని చేసింది. మరి, ఇప్పుడు ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నదే చర్చ.
బీజేపీ లేదా ఇతర పార్టీలోకి ఈటల చేరిపోయే అవకాశం ఉందని కొందరు విశ్లేషణలు చేశారు. కానీ.. ఆయన మనసులో వేరే ఆలోచన ఉందని మరికొందరు భావిస్తున్నారు. నిజానికి టీఆర్ఎస్ అధిష్టానంతో ఈటల వైరం ఈ నాటిది కాదు. మొదటి దఫా ప్రభుత్వంలోనే రాజుకున్నట్టు సమాచారం. అది చినికి చినికి గాలివానగా మారడానికి ఇంత సమయం పట్టింది.
కొంత కాలంగా ఈటల మాటల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ తో తాను ఢీకొంటున్నానన్న విషయం తన ప్రసంగాల్లో పరోక్షంగానే వినిపించారు. ఈ పదవులు ఇవాళ ఉండొచ్చు.. పోవచ్చు.. అంటూ పలు మార్లు మాట్లాడారు. అయితే.. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందుగానే ఊహించిన ఈటల.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్లో ఉన్నట్టు సమాచారం.
దాని ప్రకారం.. ఈటల ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా.. సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన తర్వాతనే.. కేసీఆర్ ఆ మధ్య సెటైర్లు వేసినట్టు సమాచారం. పార్టీ పెట్టడం అంటే అంత ఈజీకాదంటూ టీఆర్ఎస్ ముఖ్యుల సమావేశంలో మాట్లాడారు. ఈ విషయాలన్నీ క్రోడీకరిస్తున్న విశ్లేషకులు ఈటల సొంత పార్టీ పెట్టే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈటల భవిష్యత్ వ్యూహం ఇదేనని చెబుతున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.