Homeఎడ్యుకేషన్Moonlighting: మూన్ లైటింగ్ పై ఐటీ కంపెనీలు ఎందుకు భయపడుతున్నాయంటే

Moonlighting: మూన్ లైటింగ్ పై ఐటీ కంపెనీలు ఎందుకు భయపడుతున్నాయంటే

Moonlighting: ఒక సంస్థలో కొలువులో చేరి.. ఆ సంస్థ కన్ను కప్పి.. ఇంకో సంస్థకు కూడా పని చేసే విధానాన్ని మూన్ లైటింగ్ అంటారు. మన పరిభాషలో చెప్పాలంటే ఒకే పనిని ఒకేలా కాకుండా వేర్వేరు చోట్ల చేస్తూ డబ్బులు సంపాదించడం.. ఇప్పుడు ఈ విధానం ఐటి కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. విప్రో కంపెనీ ఏకంగా 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. తమ సంస్థలో ఉద్యోగాలు చేరి ఎటువంటి అనుమతి లేకుండా వేరే కంపెనీలకు కూడా ఈ 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్టుగా గుర్తించి, వెంటనే వారిని తొలగించింది. వాస్తవానికి కరోనా ఉధృతి నేపథ్యంలో ఐటీ కంపెనీల ఉద్యోగుల పనివేళలో మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇంటి వద్దే పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు.. తాము పనిచేస్తున్న సంస్థలకు తెలియకుండా ఖాళీ సమయాల్లో ఇతర సంస్థలకూ పని చేయడం మొదలుపెట్టారు. దీనిని ఆలస్యంగా గుర్తించిన కంపెనీలు.. ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. అయినప్పటికీ వారు పద్ధతి మార్చుకోలేదు. దీంతో దేశంలో పేరొందిన ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, ఐబీఎం తదుపరి చర్యలకు దిగాయి. మూన్ లైటింగ్ కు పాల్పడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశాయి. అయినప్పటికీ లెక్కచేయని 300 మంది విప్రో ఉద్యోగులు ఇతర సంస్థలకు యధావిధిగా పని చేస్తూనే ఉన్నారు. దీంతో ఒళ్ళు మండిన విప్రో కంపెనీ ఆ 300 మంది ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించింది.

Moonlighting
Moonlighting

_ రెండుగా చీలిపోయారు

విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేయడంతో ఐటీ నిపుణులు రెండుగా చీలిపోయారు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ క్రిష్ గోపాలకృష్ణన్, మోహన్ దాస్ పాయ్ నుంచి విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ, టెక్ మహీంద్రా సీఈవో సిపి గుర్నానీ పరస్పరం విభేదించుకుంటున్నారు. వివిధ ఐటీ సంస్థల్లో పని చేస్తున్న వారిలో సుమారు 60 శాతం మంది ఐటి ప్రొఫెషనల్స్ మూన్ లైటింగ్ విధానంలో పని చేస్తున్నారని కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దాదాపు 400 మంది ఐటీ నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ మూన్ లైటింగ్ విధానాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. దీనిని ఒక ఫ్రాడ్ అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన బాటలోనే ఇన్ఫోసిస్ నడుస్తోంది. మూన్ లైటింగ్ కు పాల్పడే వారిపై హెచ్చరికలు జారీ చేసింది. ఉద్వాసన పలుకుతామని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐటీ రంగంలో మూన్ లైటింగ్, నైతికత, భద్ధతపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.

Also Read: TDP Twitter Account: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. షాకిచ్చిన వైసీపీ

_ ఐటీ దిగ్గజాలు ఏమంటున్నాయి అంటే

మూన్ లైటింగ్ విధానంపై ఐటీ రంగ నిపుణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పని చేయడం విశ్వాసాన్ని ఉల్లంఘించడమేనని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ క్రిష్ గోపాల కృష్ణన్ అంటున్నారు. ఇతర ఉద్యోగాలు చేసే వారి నుంచి ఉత్పాదకతపై ప్రభావం పడుతుందని, ఇది పరస్పరం వైరుధ్యాలకు, విలువైన సమాచార ఉల్లంఘనకు, పనిలో నాణ్యత పై ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. మరోవైపు మూన్ లైటింగ్ కు పాల్పడటం ఉద్యోగులు పరస్పరం రెండు సంస్థలను మోసగించడమేనని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషబ్ ప్రేమ్ జీ అంటున్నారు. దీనిని ఎంత మాత్రం ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ మాత్రం మూన్ లైటింగ్ జీవితంలో ఒక భాగం అని తేల్చిపడేస్తున్నారు. ” నేను నగరంలో బతకడానికి వచ్చాను. నాపై ఆధారపడి కుటుంబ సభ్యులు ఉన్నారు.. మీరు ఇచ్చే జీతం నాకు సరిపోవడం లేదు. నాకు డబ్బులు చాలా అవసరం. అందుకే నేను శనివారం కూడా పని చేస్తాను. అలా పని చేయకుండా నన్ను ఎవరు ఆపలేరు. ఎందుకంటే నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీరంటే ఆగర్భ శ్రీమంతులు కాబట్టి ఇబ్బందులు ఉండవు.

Moonlighting
Moonlighting

కానీ నా పరిస్థితి అలా కాదు. నన్ను పని చేయకుండా మీరు ఆపలేరు” అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరోవైపు టెక్ మహీంద్రా సీఈవో సిపి గుర్నానీ సైతం మూన్ లైటింగ్ విధానాన్ని సమర్థిస్తున్నారు. ఏ ఉద్యోగి కైనా తన శక్తి సామర్థ్యాలను బట్టి అదనపు ఆదాయాన్ని సంపాదించుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే మూన్ లైటింగ్ పారదర్శకత విధానంలో ఉండాలని ఆయన చెబుతున్నారు. కానీ ప్రస్తుత తరం దానిని ఆమోదించే స్థితిలో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లకు పైగా ఉద్యోగులు ఇంటి వద్ద ఉండి పని చేస్తుండడంతో, ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు ఇష్టపడటం లేదు. అవసరాలు, ఆదాయం, వెసలు బాటు కారణంగా కొంతమంది ఉద్యోగులు రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే చాలా మాత్రమే ఇలా చేస్తున్నారు. ఇటువంటి వారిని గుర్తించడం కూడా కష్టమే. తగిన సమయానికి అటెండ్ కాకపోవడం, ఇచ్చిన పని నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోవడం వంటి కొన్ని పరిణామాలను గుర్తించగలిగినప్పుడే వారిపై కంపెనీలు శ్రద్ధ వహిస్తున్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను పరిశీలిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండే కంపెనీల్లో మాత్రం ఇలాంటివారిని గుర్తించడం చాలా కష్టం.

_ కంపెనీలు ఎందుకు భయపడుతున్నాయంటే?

డబ్ల్యూ ఎఫ్ హెచ్ తదుపరిదశ మూన్ లైటింగ్. ఉద్యోగులు కంపెనీలకు వచ్చేందుకు అసలు ఇష్టం పడటం లేదు. ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు ఏర్పడి ఉద్యోగం ఉండదన్న దుస్థితి వస్తే తప్ప భవిష్యత్తులో 100% ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే చాలా కంపెనీలో చాలా తక్కువ శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారు. కొన్ని కంపెనీలు 30 శాతం మంది ఉద్యోగులు వస్తున్నారని చెబుతున్నాయి. ఐదవ తరం టెలికాం సేవలు కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దూరప్రాంతాల వారికి కూడా నెట్ స్పీడ్ పెరుగుతుంది. ఆఫీస్ తో సమానంగా ఇంటి వద్ద పని చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఒకటి రెండు కంపెనీలు మినహా మిగతా కంపెనీలన్ని ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించేందుకు భయపడుతున్నాయి. ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరగడంతో రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, ఐ ఓ టి, డ్రోన్ టెక్నాలజీస్ వంటి కొత్త తరం టెక్నాలజీలో నిపుణుల కొరత అధికంగా ఉంది. ప్రస్తుతం మూడు నుంచి ఐదు ఏళ్ల అనుభవం ఉన్న వారికి కూడా రెండవ ఉద్యోగం చేసే అవకాశం లభిస్తున్నది. వారిలో కొంత మానసిక పరిజ్ఞానం కూడా ఉంటుంది. కొంత అనుభవం, చేయగల సామర్థ్యం ఉంటుంది. అయితే ఒక కంపెనీ ఇచ్చిన పనిని సమయానికి పూర్తి చేస్తూ.. ఉద్యోగ ఒప్పందానికి అనుగుణంగా ఉంటూ రెండో ఉద్యోగం చేయడంలో తప్పేం లేదు. దీనిని పరిశ్రమ కూడా అంగీకరిస్తున్నది. ఒక కంపెనీ సమాచారాన్ని మరో కంపెనీకి ఇస్తే మాత్రం ఊరుకోమని ఐటీ పరిశ్రమ స్పష్టం చేస్తోంది. రెండు ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగుల్లో నైపుణ్యాలు మరింత పెరుగుతాయి. దీనివల్ల కంపెనీలకు కూడా లాభం చేకూరుతుంది. ఉద్యోగుల్లో రిస్కు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఎంటర్ప్రైన్యురల్ సామర్థ్యాలు రెట్టింపు అవుతాయి. రెండు ఉద్యోగాలు చేసే ధోరణి ఇప్పుడు ప్రారంభం కావచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం పెరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగ కాంట్రాక్టుల్లో కొత్త క్లాజులు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఆఫీసుకు వచ్చి ఉద్యోగాలు చేసే వారికి ప్రోత్సాహకాలు పెంచే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా వారికి కొన్ని రకాల వెసలుబాటులను కల్పించేందుకు కంపెనీలు కూడా సిద్ధం అవుతున్నాయి.

Also Read:Launch Of 5G Services: దేశంలో మరో విప్లవం.. 5జీ సేవలు ప్రారంభం…ఇక ఏం జరుగుతుందంటే?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular