YCP: అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? సీఎం జగన్ ఏం ఆలోచిస్తున్నారు? ఆయన చెబుతున్నట్టు వై నాట్ 175 సాధ్యమా? లేకుంటే విపక్షాలు చెబుతున్నట్టు ఘోర ఓటమి తప్పదా? సగటు వైసీపీ శ్రేణులతో పాటు ఏపీ ప్రజల్లో సైతం ఇటువంటి సందేహాలు ఉన్నాయి. పార్టీ పరంగా వరుసగా ముంచుకొస్తున్న సంక్షోభాలు. అటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక, కర్షక రంగాలు ఉద్యమ బాట పట్టడానికి నిర్ణయించాయి. దీంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే క్రమంలో తడబడుతున్నారు. ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా 60 నుంచి 70 మంది అభ్యర్థులను మార్చి రెండోసారి గెలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ చేసిన తప్పు.. ఏపీలో రిపీట్ కాకుండా చూసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా కొంతమంది సీనియర్లు, మంత్రులు, సన్నిహితులకు జలక్ ఇస్తున్నారు. అయితే ఈ పరిణామాలు వైసీపీని కురిపిస్తున్నాయి. ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని జగన్ చెప్పుకొచ్చారు. 87% మంది లబ్ధిదారులు తమతోనే ఉన్నారని సర్వేల్లో తేలినట్లు పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ఏకంగా 11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జిలను ప్రకటించడం ఆయన ఆందోళనను తెలియజేస్తోంది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దాదాపు 100 చోట్ల సిట్టింగులు గెలవలేరని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. వైసిపి అంతర్గత సర్వేల్లో ఓటమి తప్పదని నివేదికలు వచ్చినట్లు సమాచారం. అందుకే జగన్ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏకంగా మంత్రుల స్థానాలనే మార్చడం సంచలనం అవుతుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయినా మంత్రి ఆదిమూలపు సురేష్కు ఈసారి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని సర్వేలో తేలింది. దీంతో ఆయనను కొండపికి పంపారు. వేమూరులో మంత్రి మేరుగ నాగార్జున, సంతనూతలపాడు లో టీజీ ఆర్ సుధాకర్ బాబు ఓడిపోతారని పలు సర్వేల్లో చెప్పడంతో.. సుధాకర్ బాబును ఏకంగా తప్పించారు. నాగార్జునను సంతనూతలపాడుకు పంపించారు. ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తే సుచరితకు ఓటమి తప్పదని ఐపాక్ టీం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను తాడికొండకు పంపించారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. అంతకుముందే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఇన్చార్జిగా నియమించారు. శ్రీదేవి ఒత్తిడి పెంచడంతో ఆయనను తొలగించారు. ఆమె సస్పెన్షన్ తర్వాత కత్తి సురేష్ ను ఇంచార్జిగా పెట్టారు. ఇప్పుడు సుచరితను నియమించడంతో ఆయన సైతం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేల్లో తేలడంతో వైసీపీ పెద్దలు కలవరం కనిపిస్తుంది. వారికి ఊపిరాడడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనుకున్నచోట, బలమైన టిడిపి నేతలు పోటీ చేస్తున్న చోట్ల సిట్టింగులను పక్కకు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే వారిని కనీసం సంప్రదించకుండా మార్పు చేస్తుండడం తో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిప్పల దేవాన్ రెడ్డి మనస్థాపనతోనే వైసీపీని వీడారు. అయితే దీనిని వైసీపీ పెద్దలు ఊహించలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవదని భావించేవారు పార్టీ నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వై నాట్ 175 దేవుడెరుగు.. కనీసం 75 స్థానాలు వస్తాయా? లేదా? అన్న ఆందోళన వైసిపి శ్రేణులను వెంటాడుతోంది.