Telangana BJP: పవర్(పదవి) లేకపోతే ఎంత తోపు లీడర్ అయినా సమాజం పట్టించుకోదన్నది ఎప్పటినుంచో వాడుకలో ఉన్న నానుడి. ఇప్పుడు బీజేపీలో కొందరు ఫైర్ బ్రాండ్ నేతల పరిస్థితి చూస్తే నిజమే అనిపిస్తోంది. పదవి ఉన్నప్పుడు అల్లాడించిన నేతలంతా ఇప్పుడెందుకో మూగబోయారు. ప్రత్యర్థుల్ని తమ మాటలతోనే మూడు చెరువుల నీళ్లు తాగించే వారంతా సైలెంట్ అయ్యారు. పదవి లేదనో.. లేక తెలంగాణ బీజేపీలోనే ఇలాంటి సాంప్రదాయం ఉందనో అర్థం కావట్లేదు.
ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు వినిపిస్తున్న గళాలన్నీ పదవి ఉన్న నేతలవే. ముఖ్యంగా చూసుకుంటే బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్, కిషన్‌రెడ్డి లాంటి వారి వాయిస్ మాత్రమే వినిపిస్తోంది. టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ధైర్యంగా, ఘాటుగా విమర్శిస్తున్న వారిలో వీరే కనిపిస్తున్నారు.
Also Read: BJP Navakumar: బీజేపీకి వాయిస్ గా మారిన ‘నవ కుమార్’
ఎక్కడ పార్టీ పరమైన ప్రోగ్రామ్ జరిగినా వీరే చురుగ్గా కనిపిస్తున్నారు తప్ప.. చాలా మంది ఫైర్ బ్రాండ్ నేతలు కనుమరుగైపోతున్నారు. ఇందులో చూసుకుంటే.. డీకే అరుణ, విజయశాంతి, తీన్మార్ మల్లన్న లాంటి వారు మనకు ముందుగా కనిపిస్తారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు డీకే అరుణ తన పదునైన మాటలతో టీఆర్ ఎస్ మీద నిత్యం విమర్శల దాడి చేసేది. ఉమ్మడి జిల్లాలో పార్టీని పరుగులు పెట్టించేది. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఎందుకో మౌనంగానే ఉంటుంది. తనకు తానుగా ఒక ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ.
ఇక సినీ స్టార్ విజయశాంతి పరిస్థితి కూడా ఇంతే. ఈమె కూడా కాంగ్రెస్ గూటి నుంచే వచ్చింది. అయితే అక్కడ ఉన్నప్పుడు కూడా పెద్దగా మాట్లాడలేదనుకోండి.. అది వేరే విషయం. కానీ కుటుంబ పెత్తనాలు లేని, స్వేచ్ఛ ఉంటుందని చెప్పుకునే బీజేపీలో ఆమెను ఎవరు అడ్డుకుంటున్నారు.. ఎందుకు మౌనంగా ఉంటోంది అంటే సమాధానం రాదు. ఏదైనా పార్టీ పరంగా మీటింగ్ పెట్టి అందరినీ ఆహ్వానిస్తేనే ఆమె వచ్చి మాట్లాడుతోంది. అంతే గానీ.. ఆమె స్వతహాగా ఎలాంటి కార్యక్రమం చేపట్టట్లేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ ఎస్‌ను విమర్శించే పరిస్థితి కనిపించట్లేదు.
ఇక వీరితో పాటు.. రీసెంట్ గా పార్టీలోకి వచ్చిన తీన్మార్ మల్లన్న కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో మార్నింగ్ న్యూస్ చదవడం వరకే పరిమితం అవుతున్నాడు. ఆ న్యూస్ చదివే క్రమంలో ఏదైనా టీఆర్ ఎస్‌కు వ్యతిరేక వార్త ఉంటే దాన్ని చూపించి నాలుగు తిట్లు తిట్టి వదిలేస్తున్నాడు. అంతే గానీ.. ఆయన బయటకు వచ్చి పార్టీ పరమైన కార్యక్రమాలను మాత్రం నిర్వహించట్లేదు. బీజేపీ లీడర్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టింది కూడా లేదు. ఎంతసేపు సోషల్ మీడియాలోనే ఏవేవో పోస్టు పెడుతూ టైమ్ గడిపేస్తున్నాడు.
మరి వీరు అంతకు ముందు కూడా ఇలాగే ఉండేవారా అంటే కాదు.. ఈ ముగ్గురూ కూడా మాటల్లో ఆరితేరిన వారే. విమర్శణ బాణాలు విసరడంలో ఎవరికి వారే సాటి. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో డీకే అరుణను అందరూ టార్గెట్ చేసేవారంటే ఆమె ఏ రేంజ్‌లో పాలిటిక్స్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు టీఆర్ ఎస్ నేతల మాటల్లో గానీ విమర్శల్లో గానీ.. ఎక్కడా డీకే అరుణ పేరు వినిపించట్లేదు. ఇక విజయశాంతి అయితే ఏదో పార్టీలో చేరాం.. ఉన్నాం అన్నట్టుగానే ఉంటోంది.
అంతకు ముందు తీన్మార్ మల్లన్న బహుజన గర్జన లాంటి కార్యక్రమాలతో పెద్ద పెద్ద సభలు, మీటింగులు పెట్టాడు. పాదయాత్ర కూడా చేశాడు. కానీ బీజేపీలో చేరిన తర్వాత మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతోందేంటంటే.. బీజేపీలో కూడా అణచివేసే నియంతృత్వ ధోరణి ఉందన్నమాట. ఎవరికి వారు ఏదీ చేయడానికి వీల్లేదు.
అధ్యక్షుల వారు చేసిన దానికి సపోర్టు చేయడం, లేదంటే చేస్తూ చూస్తూ ఉండటం వరకే పరిమితం కావాలన్న మాట. బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న వారి మాట కంటే కూడా.. పదవిలో ఉన్న వారి మాటనే సాగుతోందని స్పష్టం అవుతోంది. అంటే ఈ ముగ్గురికి పదవుల్లేవు కాబట్టి.. వారి మాట సాగట్లేదనుకోవాలా.. కారణాలు ఏవైతే నేం.. బీజేపీలో చాలామంది ఇలాంటి ఫైర్ బ్రాండ్ నేతలు పదవి లేక మౌనంగానే ఉండటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ప్రజల అభివృద్ధే ముఖ్యం చెప్పుకునే ఈ నేతలు.. పదవి ఉంటేనే మాట్లాడుతారా.. లేకపోతే మౌనంగా ఉండిపోతారా ఇదేం తీరు. రాజకీయాల్లో రాణించాలంటే నిత్యం సవారీ చేస్తూనే ఉండాలి గానీ పదవి ఉంటేనే స్పందిస్తాం, లేదంటే మాకేంటి అన్నట్టు వ్యవహరిస్తే ఎలా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి వీరికి పదవి రావాలంటే నిత్యం జనాల్లో ఉండాలి గానీ.. మౌనంగా ఉంటే ఎలా.
నల్గొండలో రాణించాలని తీన్మార్ మల్లన్న, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను గుప్పిట్లో పెట్టుకోవాలని డీకే అరుణ కలలు కంటున్నారు. ఇక విజయశాంతి అయితే ఇప్పటి వరకు ఎలాంటి భవిష్యత్ ప్లాన్‌ను ప్రకటించట్లేదు. మరి ఆమె బీజేపీలోకి అసలు ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఏదేమైనా వీరు ముగ్గురూ తమ దారుల్లో రాణించాలంటే మాత్రం మౌనదీక్షను వీడాల్సిందే.
Also Read:Radhika: హిందూగా పుట్టి ముస్లిం ఫ్యామిలీలో పెరిగిన రాధిక.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Recommended Videos