KCR Health: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరో పక్షం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాలో మంచి ముహూర్తం చూసుకుని(ఆగస్టు 21న) 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇక ప్రచార క్షేత్రంలో దూసుకుపోవడమే అన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఇంతలోనే కేంద్రం జమిలీ ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి కేసీఆర్ స్పీడ్‌కు బ్రేక్ వేసింది.
ప్రచారం చేయొద్దని సూచన..
అసలు ఎన్నికలు డిసెంబర్‌లో జరుగుతాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవయ్యాయి. దీంతో ఇప్పటి నుంచే ఖర్చు పెట్టడం ఎందుకని భావించిన గులాబీ బాస్ అభ్యర్థులు ఇప్పుడే నియోజకవర్గాల్లో ప్రచారం చేయొద్దని సూచించారు. అయితే దీని వెనుక రెండు అర్థాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకటి ఎన్నికలు ఆసల్యమవుతాయని, మరొకటి అభ్యర్థులను మారుస్తారేమో అని.
షెడ్యూల్ ప్రకారమే..
కానీ, జమిలి ఎన్నికలు ప్రస్తుత పరిస్థితిలో జరిగే అవకాశం కనిపించడం లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇంత జరుగుతున్నా బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్షం రోజులుగా బయటకు రావడం లేదు. దీంతో కేసీఆర్‌కు ఏమైంది.. ఎందుకు బయటకు రావడం లేదు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జ్వరం నిజమేనా..
ఇదిలా ఉంటే.. కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని ఆయన తనయుడు కేటీఆర్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. అందుకే బయటకు రావడం లేదని తెలిపారు. అయితే జ్వరం ప్రకటనపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా జ్వరం ఉంటే.. ముఖ్యమంత్రి హెల్త్ బులిటెన్ నిత్యం విడుదల చేసేవారు. కానీ ఎక్కడా బులిటెన్ ఇవ్వడం లేదు. జ్వరం ఏరకమైందో ప్రకటించడం లేదు. దీంతో బీజేపీ జాతీయ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రకటించినట్లు కేసీఆర్ ప్రగతి భవన్‌లో తాంత్రిక పూజలు చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. కొంతమందేమో.. ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నట్లు, నిధులు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రధాని రాక నేపథ్యంలోనే..
మరోవైపు బీజేపీ నేతలు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు కావడంతోనే కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లాల్సి వస్తుందనే తప్పుడు జ్వరం ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధాని రెండు రోజలు తెలంగాణ పర్యటన ముగిసిన తర్వాతనే కేసీఆర్‌కు జ్వరం తగ్గుతుందని పేర్కొంటున్నారు.
క్యాబినెట్ భేటీ వాయిదా..
మరోవైపు సీఎం కేసీఆర్‌కు జ్వరం తగ్గకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మళ్లీ ఎప్పుడు సమావేశం ఉంటుందనే విషయంపై క్లారిటీ లేదు. అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ భేటీ ఉండే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ నిర్వహిస్తే ప్రధాని పర్యటన, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ అనవసరం రాద్ధాంతం చేసుకోవడం, విమర్శలు ఎదుర్కోవడం ఎందుకనే జ్వరం తగ్గడం లేదని తెలుస్తోంది.