
దశాబ్దాల రాజకీయ చరిత్ర గల నేత చంద్రబాబు. ఎన్నికలు వచ్చాయంటే చంద్రబాబు సవాళ్లు అన్నీఇన్నీ కావు. ఎంతలా అంటే.. ఇక ఈ ప్రభుత్వం కూలబోతోంది.. మళ్లీ మన ప్రభుత్వమే కొలువుదీరబోతోంది అని నమ్మించే ప్రయత్నమే చేస్తుంటారు. ఏపీలో మొన్న జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వేళ కూడా చంద్రబాబు విసిరిన ఛాలెంజ్‌లు అందరం చూశాం. కానీ.. ఆ రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు టీడీపీకి ఎలాంటి రకమైన సమాధానం చెప్పారో కూడా తెలిసిందే. ఇప్పుడు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల దెబ్బకు చంద్రబాబు ఛాలెంజ్‌లు పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కావాలని ఎన్నికలను కొనితెచ్చుకున్న చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురుకావడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఘోర ఓటమి ఆయన్ను ప్రజాక్షేత్రంలోకి రానివ్వడం లేదు. దీనికితోడు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మరిన్ని మల్లగుల్లాలు పడుతున్నారు. తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక తథ్యమని తేలిపోయింది. సంప్రదాయంగా మృతిచెందిన వారి స్థానంలో మరే పార్టీ పోటీ పెట్టదు. కానీ.. జగన్ పై, ఆయన పాలనపై ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు తాము పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ప్రకటించారు. అంతేకాదు అప్పటికప్పుడు తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించారు.
ఇదంతా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగక ముందు పరిస్థితి. అప్పట్లో చంద్రబాబు అంచనాలు వేరే. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని చంద్రబాబు భావించారు. అన్నా క్యాంటిన్లు తీసివేయడం, మద్యం బ్రాండ్లు, ఇసుక కొరత, కరోనా వేళ ఉపాధి అవకాశాలు దెబ్బతినడం వంటి కారణాలు జగన్ ను దెబ్బతీస్తాయని ఎంతోగానో ఊహించారు. అందుకే లోకల్ బాడీ ఎన్నికలకు సై అన్నారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయమని వైసీపీ కోరితే ఓటమి భయంతోనే వెనకడుగు వేస్తున్నారని కవ్వించారు కూడా.
ఆ రెండు ఎన్నికలతో ప్రజల్లో జగన్‌పై వ్యతిరేకత లేదన్నది స్పష్టమైంది. దీంతో తిరుపతి ఉప ఎన్నికకు ఎందుకు అభ్యర్థిని బరిలోకి దించామా? అని చంద్రబాబు ఇప్పుడు తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఇన్‌చార్జీలపై అక్కడ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచిన ఊపు మీద ఉండటం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండటంతో గెలవడం కష్టమని తెలిసినా పార్టీకి ఊపు తేవడం కోసం అప్పట్లో అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పుడు టీడీపీ క్యాడర్‌లో కూడా ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదట. ఈ నేపథ్యంలో తిరుపతి సీటును గెలుచుకోలేకపోయినా కనీసం సెకండ్ ప్లేస్ అయినా దక్కుతుందా అనే అనుమానాలు ఆ పార్టీ కార్యకర్తల్లోనూ కనిపిస్తోందట.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్