Chandrababu And Pawan: పొత్తులపై హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు ఎందుకు? అటు పవన్ సైతం కదలికలను తగ్గించారు ఎందుకు? అసలు ప్రతిపక్ష కూటమి పరిస్థితి ఏంటి? కూటమి కడతారా? ఎవరికి వారుగా పోటీ చేస్తారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. కొత్తగా బిజెపి ఆ జాబితాలో చేరింది. చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పొత్తుల చర్చల్లో మందగమనం కనిపిస్తోంది. చంద్రబాబు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. పార్టీ నేతలకు సైతం అందుబాటులో ఉండడం లేదు. అయితే చంద్రబాబుది వ్యూహమా? వ్యూహాత్మకమా?అన్నది తెలియడం లేదు.
చంద్రబాబు రా కదలిరా సభలు సైతం నిలిచిపోయాయి. పవన్ కళ్యాణ్ పర్యటన సైతం వాయిదా పడింది. కీలక సమయంలో ఇద్దరు భాగస్వామ్య నేతలు మౌనం పాటించడం విశేషం. బిజెపి భారీ డిమాండ్లతోనే పొత్తులో ప్రతిష్ఠంభన ఏర్పడినట్లు సమాచారం. చంద్రబాబు ఏరి కోరి బిజెపి నేతల వద్దకు వెళ్లడంతో వారు గొంతెమ్మ కోరికలు కోరిందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది. బిజెపిని వదిలి ఎన్నికలకు వెళ్లలేరు.. అలాగని బిజెపి డిమాండ్లకు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పూర్తిగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఎలాగోలా తన వైపుకు తిప్పుకున్నారు. కానీ బిజెపి మాత్రం ఆ పరిస్థితుల్లో లేదు. బిజెపి, జనసేన కూటమికి 60 అసెంబ్లీ, పది లోక్ సభ సీట్లు ఇవ్వాలని అమిత్ షా షరతు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. అటు పవర్ షేరింగ్ విషయంలో సైతం పట్టుబడుతున్నట్లు సమాచారం. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిజెపి షరతును టిడిపి శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. చంద్రబాబు పూర్తిగా సైలెంట్ లోకి వెళ్ళిపోగా.. పవన్ సైతం చంద్రబాబును కలవడం లేదు. దీంతో పొత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చి జగన్ దూకుడు మీద ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల ప్రచారం చేయాల్సిన విపక్షాలు ఎవరికి వారుగా ఉంటున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు తో పాటు పవన్ గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వాటిని అధిగమించి ఇద్దరు నేతలు ముందుకు సాగకుంటే మాత్రం.. పొత్తులు లాభం కంటే నష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.