Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన గుండె నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. గత మూడు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె సంబంధిత సమస్యగా వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయితే స్టంట్ వెయ్యాలా? ఆపరేషన్ చేయాలా? అన్నది నిర్ధారిస్తామని చెప్పారు. కానీ మంత్రి అత్యవసర పనులు ఉన్నాయంటూ ఆసుపత్రిలో చేరలేదు.
బొత్స ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఆయన మేనకోడలి పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో తాను ఆసుపత్రిలో చేరితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని బొత్స భావించారు. అయితే కుటుంబ సభ్యులు వారించడంతో ఆసుపత్రిలో చేరేందుకు ఒప్పుకున్నారు. ఆయన కుమారుడు సందీప్ హుటాహుటిన తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్లారు. గుండె ఆపరేషన్లకు ప్రసిద్ధి చెందిన ఆసుపత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బొత్స వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. అన్ని పరీక్షలు చేసి.. స్టన్స్ వేయాలా? ఆపరేషన్ చేయాలా? అన్నది నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి.
అయితే బొత్స హైదరాబాద్ ఆసుపత్రిలో చేరికపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీలో వైద్య సదుపాయాలు మరోసారి చర్చకు దారి తీశాయి. ఏపీలో ఎగువ మధ్యతరగతి నుంచి ప్రముఖుల వరకు వైద్య సేవలు కోసం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఆశ్రయిస్తున్నారు. కరోనా సమయం నుంచి నేటి వరకు అదే పరిస్థితి కొనసాగుతోంది. కొవిడ్ సమయంలో స్థానికంగా వైద్య సేవలు అందక చాలామంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో కూడా అతి కష్టం మీద హైదరాబాద్ తరలించిన సందర్భాలు ఉన్నాయి.ఒకరిద్దరు మంత్రులు అస్వస్థతకు గురికాగా.. ప్రభుత్వమే సొంత ఖర్చులతో హైదరాబాదులో వైద్య సేవలు అందించింది. కానీ అవే ఆసుపత్రులను ఏపీలో నెలకొల్పడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి వాటితో ఏపీలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ అత్యవసర, అనారోగ్య సమయాల్లో సేవలందించే ఆసుపత్రుల ఏర్పాటు విషయంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. తాజాగా మంత్రి బొత్స హైదరాబాద్ ఆసుపత్రిలో చేరడంతో.. ఏపీలో వైద్య సేవలపై కొత్త చర్చ ప్రారంభమైంది.