YS Sunitha : ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష కూటమి పార్టీలు ఒకదాన్ని మించి మరొకటి ఎత్తులు వేసుకుంటున్నాయి. పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించుకుంటున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీలో దివంగత వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. “నా తండ్రిని కొంతమంది చంపారు. అప్పుడు నా చుట్టూ వారు తిరిగారు. ఆ సమయంలో నేను గుర్తించలేకపోయాను. తర్వాత అసలు విషయం తెలిసి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో వారికి ఓటు వేయద్దు” అని సునీత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సునీత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసిపి నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. “వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. నాడు తన తండ్రి మరణానికి జగన్ కారణమని తెలిసినప్పుడు ఎందుకు అరెస్టు చేయమని డిమాండ్ చేయలేదు. పైగా వివేకానంద రెడ్డిని హత్య చేశాడని దస్తగిరి అభియోగాలు ఎదుర్కొంటున్నప్పుడు.. అతడి అరెస్టుకు ఎందుకు అడ్డుపడుతున్నట్టు? అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి ఓటమి కోసం పనిచేశాడని సునీతకు తెలుసు. అప్పటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి పై బీటెక్ రవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఓడిపోయారు.. అలాంటప్పుడు బీటెక్ రవి, అవినాష్ రెడ్డి ఒకటే కదా.. ఆ విషయాన్ని సునీత దాచారు.. సునీత చెప్పినవన్నీ నిజాలయితే నేషనల్ మీడియా ఎందుకు పట్టించుకోదు” అని వైసిపి నాయకులు సునీతను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో టిడిపి నాయకులు సునితను సమర్థిస్తున్నారు. తన తండ్రి చనిపోయి బాధలో సునీత ఉంటే కనీసం జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేయడం లేదని వారు అంటున్నారు. అందు వల్లే ఆమె ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని.. అక్కడ విలేకరుల సమావేశంలో కీలక విషయాలు చెప్పిందని.. టిడిపి నాయకులు గుర్తు చేస్తున్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి, కీలకమైన పత్రాలు ఎత్తుకెళ్లారని టిడిపి నాయకులు అంటున్నారు. ఆ పత్రాలు బయటపడితే తన రాజకీయ జీవితం నాశనమవుతుందని జగన్ భయపడుతున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, సునీత విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలు తమకు ప్రతిబంధకంగా మారకుండా ఉండడానికి వైసీపీ నాయకులు అన్నిమార్గాలలో కౌంటర్ ఇస్తున్నారు.
మరోవైపు సునిత చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సునీత మాట్లాడిన మాటలు టిడిపి కోణంలో ఉన్నాయని కొందరు అంటుంటే.. అప్పట్లో జగన్ అలాంటి దారుణానికి పాల్పడితే సునీత ఎందుకు సైలెంట్ గా ఉందని మరికొందరంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి సునీత చేసిన విమర్శలు న్యాయబద్ధమైనవే అయినప్పటికీ.. వాటి వెనుక అనేక చిక్కుముళ్ళు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి మరణం ఒక సంచలనం కాగా.. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన హత్యోదతం చర్చనీయాంశం కావడం విశేషం. అయితే సునీత చేసిన ఆరోపణలు టిడిపికి సానుకూలంగా ఉంటాయా?.. వైసిపికి అనుకూలంగా ఉంటాయా?.. లేకుంటే ఇంకా ఏమైనా రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయా? అనేది వేచి చూడాల్సి ఉంది.