Chandrababu- BRS: ” నేను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని వీడాలి అనుకోలేదు. కీలకమైన నేతలు మొత్తం ఆ పార్టీని విడిచిపెట్టారు. నేను కూడా నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ ఉపయోగం లేకుండా పోయింది. అందుకే భారత రాష్ట్ర సమితిలో చేరాల్సి వచ్చింది. ఇక్కడ కూడా కొంతమంది నాయకులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అయినప్పటికీ నాకు వచ్చిన ఇబ్బంది లేదు.. నియోజకవర్గ ప్రజలు తెలివైన వారు.. వారు అన్నింటినీ గమనిస్తున్నారు” ఇవీ భారత రాష్ట్ర సమితి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలు.. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీలో అంతర్గత పోరు ఏ విధంగా సాగుతోందో.. చివరకు తాను గత్యంతరం లేని పరిస్థితిలోనే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.

ఏం జరుగుతోంది
సత్తుపల్లి అనేది ఖమ్మం జిల్లాలో పూర్తి రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం.. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా గెలుపొందారు.. నియోజకవర్గం దళితులకు రిజర్వ్ కావడంతో సండ్ర వెంకట వీరయ్య 2009 నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు.. మూడుసార్లు కూడా ఆయన టిడిపి నుంచే గెలిచారు. ఈ క్రమంలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరారు.. ఇక అప్పటినుంచి ఆయనకు పొగ మొదలైంది.
ప్రత్యర్ధుల నుంచి..
సండ్ర వెంకట వీరయ్య చేతిలో రెండుసార్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఓడిపోయారు.. అంతకుముందు ఆయనకు పోటీగా మట్టా దయానంద్ విజయ్ కుమార్ కూడా ఉన్నారు. ఈయన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్నారు. సండ్ర వెంకట వీరయ్య కు పొంగులేటి వర్గానికి అక్కడ పొసగడం లేదు. గత ఎన్నికల్లోనే తనకు టికెట్ ఇవ్వాలని దయానంద్ కోరగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.. కానీ ఇంతవరకు అది నెరవేరలేదు. దీనికి తోడు పొంగులేటి వర్గం ఈ నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో సండ్ర వెంకటవీరయ్యకు ఇబ్బంది ఎదురవుతున్నది.

చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో..
అయితే ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన సభలో టిడిపిని వీడినవారు మళ్లీ పార్టీలోకి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. పైగా సత్తుపల్లి నియోజకవర్గం లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.. ఇతర కులాల వారి ఓట్లు కూడా భారీగానే ఉన్నాయి. వీరంతా కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. అయితే వారి ఓటు బ్యాంకు ను కూడా తనవైపు మళ్లించుకునేందుకు వెంకట వీరయ్య అవకాశం వచ్చిన ప్రతి సమావేశంలోనూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు సీఎం కేసీఆర్ తోనూ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. అవకాశం ఎటు వస్తే అటే సండ్ర దూకాలని చూస్తున్నారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. మొత్తానికి చంద్రబాబు పర్యటన ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితిలో ఉన్న అంతర్గత కలహాలను వెలుగులోకి తెస్తోంది.