Margadarsi Case: ఇప్పటికే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. పరిస్థితులు అనుకూలంగా మారితే లోకేష్ కూడా జైలుకు వెళ్తాడు. అంటే జగన్ స్కెచ్ చాలా గట్టిగానే ఉందన్నమాట. అయితే చంద్రబాబుకు ఉన్న శక్తుల్లో రామోజీరావు ఒకడు. అయితే ఈ రామోజీరావును దెబ్బ కొట్టేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కుదుపు కుదిపినప్పటికీ రామోజీరావు వెంటనే చేరుకున్నాడు. వైయస్ మరణం తర్వాత రామోజీరావును ఏ రాజకీయ నాయకుడు కూడా ఏమి చేయలేకపోయాడు. ఏపీలో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు రామోజీరావును జగన్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాతే రామోజీరావు మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాడు. అగ్నికి వాయువు తోడైనట్టు జగన్మోహన్ రెడ్డికి ఉండవల్లి అరుణ్ కుమార్ తోడు కావడంతో రామోజీరావుకు ఉక్కపోత మొదలైంది.
సహజంగానే రామోజీరావుకు మార్గదర్శి ఆర్థికంగా అండదండలు అందిస్తోంది. అతడి గ్రూపు సంస్థల్లో మార్గదర్శి విపరీతమైన లాభాల్లో ఉంది. అయితే ఇందులో ఉన్న అవకతవకలను ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా తెలివిగా పసిగట్టి కోర్టుకు లాగాడు. ఎలాగూ చంద్రబాబుకు రామోజీరావు ప్రధాన ఆర్థిక స్థంభం కాబట్టి ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు. ఇక అప్పటినుంచి మార్గదర్శి మీద దూకుడు మొదలుపెట్టాడు. అసలు రామోజీరావు అంటేనే కాలాతీతమైన వ్యక్తి అని భావించే పరిస్థితులను ఒక్కసారిగా జగన్ మార్చేశాడు. తాను బంగారపు సింహాసనం మీద కూర్చుని మిగతా వారిని మామూలు కుర్చీల్లో కూర్చోబెట్టే రామోజీరావును జగన్ ఏకంగా పడుకోబెట్టాడు. సిఐడి అధికారులతో పలు దఫాలుగా విచారణ నిర్వహించాడు. అంతేకాదు ఏపీలో మార్గదర్శి వ్యాపారాన్ని దాదాపుగా మూసే ప్రయత్నం చేశాడు. ఇక్కడితో జగన్ ఆగలేదు.
అయితే మార్గదర్శి సంస్థకు సంబంధించి వ్యాపార భాగస్వామి అయినా యూరి రెడ్డి మీద రామోజీరావు దౌర్జన్యానికి పాల్పడ్డాడని తాజాగా ఒక కేసు నమోదు అయింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కేవలం సాక్షి మీడియాలో మాత్రమే వార్తలు ప్రసారమయ్యాయి. మిగతా మీడియాలో దీని గురించి ప్రస్తావన కూడా రాలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో టాప్ 2 చానల్స్ గా చెప్పుకునే ఎన్టీవీ, టీవీ9 లో వాటి గురించి ప్రస్తావనే లేదు. రామోజీరావు విషయంలో మిగతా చానల్స్ కూడా సానుభూతి ప్రకటిస్తున్నాయని అనుకోవాలి. అయితే యూరి రెడ్డి పెట్టిన కేసు ద్వారా తనకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రామోజీరావు కోర్టుకు వెళ్ళాడు. కోర్టు కూడా రామోజీరావు చెప్పిన దాన్ని విన్నది. వచ్చే నెల వరకు ఆయనకు వెసులుబాటు కల్పించింది. అంతే కాదు పోలీసులు తదుపరి అడుగులు వేగంగా వేయకుండా ఉండేందుకు బ్రేకులు వేసింది. సహజంగానే ఈ పరిణామం రామోజీ మోములో హర్షం వికసించేలా చేసింది. రామోజీరావు ప్రధాన ఆర్థిక వనరు మార్గదర్శి ని ఏమి చేయకుండా జగన్ దూకుడుకు బ్రేక్ వేసింది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో జగన్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది?