తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అర్థం కావు. ఆయన చతురతతో ప్రణాళికలు వేస్తుంటారు. ఇందులో భాగంగా రకరకాల విశ్లేషణలు చేస్తూ రాజకీయంగా బలపడేందుకు పావులు కదుపుతుంటారు. తాజాగా ఆయన ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే విధంగా చూస్తున్నారని సమాచారం. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పల్లెల్ని చుడుతున్నారని ప్రచారం జోరందుకుంది.
కేసీఆర్ ఉద్దేశాలు, లక్ష్యాలు వేరే ఉన్నాయి. కొడుకు కేటీఆర్ ను సీఎం ను చేసి తాను జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో విపక్షాలు బలపడకముందే తాను మేలుకోవాలని చూస్తున్నారు. ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారు. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయాల నేపథ్యంలో బీజేపీపై తన వ్యూహమేమిటో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఓ సారి పోటీ ఉందంటారు. మరోసారి రాజీ లేదు సమరం లేదు అంటారు. ఇంకోసారి మాకు ఎవరు పోటీ కాదు. ఎవరితో కలవం అంటూ రకరకాల మాటలు మాట్లాడుతూ అందరిని ఇరుకున పెడుతున్నారు. కానీ ముందస్తుకు సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
2023లో ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
దీంతో మరోసారి ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారు. బంగారు తెలంగాణ వైపు వెళ్లాలనే భావనతో జిల్లాల పర్యటనకు బయలుదేరినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ర్టాల ఎన్నికలు జరగాల్సిన సందర్భంలో కేసీఆర్ మనసులో ముందస్తు ఎన్నికల ఆలోచన ఉందో లేక జమిలి ఎన్నికలకు వెళ్తారో తెలియకుండా ఉంది. కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.