MLA Raghunandan Rao: సాధారణంగా నమస్తే తెలంగాణ భారత జనతా పార్టీ వార్తలు ప్రచురించదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాదులో అధికారిక పర్యటన కొనసాగించినప్పటికీ సెంటిమీటర్ సింగిల్ కాలం వార్త కూడా పబ్లిష్ చేయదు. ఒక రకంగా చెప్పాలంటే కవిత ఓడిపోయిన తర్వాత నమస్తే తెలంగాణ భారతీయ జనతా పార్టీపై ఏకంగా యుద్ధమే ప్రకటించింది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు, తమ వివరణ కూడా తీసుకోవడం లేదని చెబుతూ భారతీయ జనతా పార్టీ నమస్తే తెలంగాణను నిషేధించింది. కానీ అలాంటి నమస్తే తెలంగాణ మంగళవారం ఎడిషన్ లో దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు కు టాప్ ప్రయారిటీ ఇచ్చింది. రాజకీయ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది
వాస్తవానికి సోమవారం ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి రఘునందన్ రావు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు. కానీ అప్పట్లో దానిని బండి సంజయ్ కి అప్పగించారు. ఆ తర్వాత అసెంబ్లీలో బిజెపి పక్ష నేతగా అవకాశం ఇవ్వాలని అడిగినప్పటికీ అది కూడా దక్కలేదు. జాతీయ స్థాయిలో పదవుల్లో ఆకాశం ఇస్తారని రఘునందన్ రావు ఆశించారు. వారికి అక్కడ కూడా భంగపాటు ఎదురైంది. తన తర్వాత పార్టీలో చేరిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కిన ప్రాధాన్యమైనా తనకు దక్కడం లేదని రఘునందన్ రావు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారతారని చర్చ మొదలైంది.. రఘునందన్ రావుకు పటాన్చెరువు లేదా సంగారెడ్డి నుంచి ఎక్కడో ఒక చోట అవకాశం కల్పిస్తే భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రఘునందన్ రావు ను ఆహ్వానించినట్లు తెలిసింది. దుబ్బాక లేదంటే పటాన్చెరువులో రఘునందన్ రావును బరిలోకి దింపేందుకు రేవంత్ రెడ్డి చర్చించారని అంశం కూడా చక్కర్లు కొట్టింది.. బండి సంజయ్ పై తొలిసారిగా అవినీతి ఆరోపణల వెనుక భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం చక్రం తిప్పిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. బండి సంజయ్ ని తప్పించేందుకు రఘునందన్ రావుని వాడుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు
మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సోమవారం చేసిన వ్యాఖ్యలు ఇంకా చల్లారడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రఘునందన్ రావు ఆరోపణలు చేయడం అధిష్టానాన్ని ఇరుకున పెడుతోంది.. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని విమర్శించిన బిజెపి.. రఘు నందన్ రావు చేసిన వ్యాఖ్యలతో తల దించుకునే పరిస్థితి ఎదురైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తర్వాత ఆ తప్పును మొత్తం మీడియా మొత్తం వైపు రఘునందన్ రావు నెట్టేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో రఘునందన్ రావు వెనుక భారత రాష్ట్ర సమితి పెద్దలు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో బండి సంజయ్ భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ప్రజల్లో నిలబెట్టడం.. ఏకంగా కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం తో రాష్ట్రంలో అధికార పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనిని తెలివిగా పరిష్కరించుకునేందుకు భారత రాష్ట్ర సమితి రఘునందన్ రావు అనే ఆయుధాన్ని ఆడినట్టు ప్రచారం జరుగుతున్నది. మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి ప్రత్యామ్నాయం మేమే అని ప్రచారం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అంతర్గతంగా కుమ్ములాటలకు కేంద్ర బిందువు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి దీని నివారణకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.