Minister KTR- BJP: రాష్ట్ర బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందికరంగా మారాయి. భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం అని ముద్ర వేసుకున్న పార్టీ చివరికి ఇలా అయిపోవడం ఆ పార్టీ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. బిజెపికి పెద్ద పెద్ద తలకాయలుగా ఉన్న నాయకులు ఒకరిపై ఒక విమర్శలు చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. అంతేకాదు ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ని మారుస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుండడం.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేయడం ఆ పార్టీని ప్రజల్లో చులకన చేస్తున్నది. అధిష్టానం మీద రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేయడం.. తర్వాత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే భారతీయ జనతా పార్టీలో ఈ స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు జరిగేందుకు కారణం కేటీఆర్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర బిజెపిలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలకు ఇటీవల మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనే కారణమన్న అభిప్రాయాలను ఎంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి మధ్య రాజీ కుదిరిందని, అందుకే మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం లేదంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు నిన్న మొన్నటిదాకా ప్రతి సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికార పార్టీ నేతలు ఎవరు కూడా పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఇదే క్రమంలో గత నెలలో మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలవాలి అనుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో అపాయింట్మెంట్ కలవకుండానే వెను తిరిగివచ్చారు. కానీ కేటీఆర్ ఢిల్లీ పర్యటన ముగిశాక బిజెపిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత రాష్ట్ర సమితి పై, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని బిజెపి పెద్దలను గులాబీ అధిష్టానం కోరినట్లు తెలుస్తోంది. అయితే సంజయ్ మద్దతుదారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సంజయ్ ని మారిస్తే ఊరుకో బోమని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
వాస్తవానికి కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసింది కేవలం నిధుల కోసం మాత్రమే కాదని, దాని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేరుకు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ అంతర్గతంగా రఘునందన్ రావు తో భారత రాష్ట్ర సమితి పెద్దలు స్నేహం కొనసాగిస్తున్నారని వారు చెబుతున్నారు. గతంలో రఘునందన్ రావు కూతురు ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయగా.. దాన్ని ప్రారంభించేందుకు హరీష్ రావు వెళ్లడం, దానికి హరీష్ రావును స్వయంగా రఘునందన్ రావు ఆహ్వానించడం అప్పట్లో చర్చనీయాంశమయింది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ని రఘునందన్ రావు పిలవలేదు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి ని కూడా ఆహ్వానించలేదు. అంటే భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా రఘునందన్ రావు తో గులాబీ పెద్దలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రఘునందన్ రావును తెర ముందు పెట్టి బండి సంజయ్ ని తప్పించాలని ఎత్తుగడతో కేటీఆర్ ఢిల్లీలో పర్యటించాలని ప్రచారం జరుగుతున్నది. కేటీఆర్ అమిత్ షా ను కలవాలి అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో అపాయింట్మెంట్ రద్దయింది. ఇక ఎన్నడు లేని విధంగా నమస్తే తెలంగాణలో రఘు నందన్ రావుకు కీలకమైన ప్రయారిటీ దక్కింది. అంటే కేటీఆర్ ఆడిన మైండ్ గేమ్ తో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ కుదుపునకు గురైంది. ఈ కమలం కప్పులో తుఫాను ఎప్పుడు చల్లారుతుందో వేచి చూడాల్సి ఉంది.