
దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. బలమైన నాయకత్వం లేక చతికిలపడిపోతోంది. వందేళ్లు దేశ గమనాన్ని నిర్దేశించిన జాతీయ పార్టీ ప్రస్తుతం తిరోగమనంలో సాగడంతో నాయకుల్లో సైతం భయం పట్టుకుంది. భవిష్యత్తులో పార్టీని నడిపించగల సత్తా కోసం ఎదురు చూస్తున్నారు. యువ రక్తమే కావాలని ఆకాంక్షిస్తున్నారు. 2014 నుంచి పార్టీ మరింత పాతాళంలోకి పడిపోయింది. ఏఐసీసీ నాయకత్వం పట్టించుకోకపోవడంతో పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది.
అధికారంలో లేకపోతే అందరికి చిన్నచూపే. పంజాబ్, రాజస్థాన్, చత్తీస్ గడ్ ముఖ్యమంత్రులు అధినేత సోనియాగాంధీ ని చిన్నచూపు చూస్తున్నారని తెలుస్తోంది. ముగ్గురు సీఎంలను అసమ్మతి వెంటాడుతోంది. సీఎంల నియంతృత్వ ధోరణితో నాయకత్వం ఏమి చేయలేకపోతోంది. సమన్వయంతో పనిచేయాలని అధినాయకత్వం చెబుతుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించడమే తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.
కాంగ్రెస్ పార్టీకిది పరీక్షా కాలం. అధికారంలో లేకపోతే ఎవరూ మాట వినరు. ఏ పార్టీకి అయినా అధికారమే పరమౌషధం. అయితే పాత తరం వారిని నమ్ముకుంటే పార్టీ ఎదుగుదల ప్రశ్నార్థకమే. యువతకు అధికారం ఇవ్వాలి. పదవులు కట్టబెట్టి వారితో పని చేయించుకుంటేనే అధికారం వశమవుతుంది. ఫలితంగా భవిష్యత్తు బాగుంటుందని నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో యువతకే పెద్దపీట వేయాలని యోచిస్తోంది.
ఎన్డీఏకు వ్యతిరేకంగా బలమైన కూటమి నిర్మించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీజేపీ అధికారం తప్పించేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, శరత్ పవార్ వంటి నాయకులను కలుపుకుని వెళ్లేందుకు ముందుకు వెళుతున్నారు. 2023 నాటికైనా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసుకుని రాష్ర్టాల్లోని యువనాయత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే కాంగ్రెస్ తో జత కట్టేందుకు ప్రాంతీయ పార్టీలు ముందుకు వస్తాయి. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధించాలంటే మరింత కష్టపడక తప్పదు.