West Bengal Election 2026 Analysis: ఈసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మూడుసార్లు అధికారంలోకి వచ్చిన మమత.. ఈసారి కూడా తమదే అధికారం అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అలాగని తాము ఈసారి అధికారంలోకి వస్తామని బిజెపి నాయకులు కూడా చెప్పుకోలేని దుస్థితి. ఈసారి ఎన్నడు లేని విధంగా బెంగాల్ ప్రజలు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు.. అనేక సర్వే సంస్థలు రకరకాల వివరాలు వెల్లడిస్తున్నప్పటికీ.. బెంగాల్ ప్రజల నాడి అంత ఈజీగా దొరకడం లేదు.
ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి కొన్నిచోట్ల 2021 ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచిన మెజార్టీ కంటే ఎస్ఐఆర్ ద్వారా పోయిన నకిలీ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో 11 జిల్లాలోని 70 అసెంబ్లీ స్థానాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో అత్యంత కీలకపాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసి ఓడిపోయిన నందిగ్రామ్, ఉప ఎన్నికల్లో గెలిచిన భవానిపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇటీవల కాలంలో బెంగాల్ రాష్ట్రంలో వరస సంఘటనలు జరిగాయి. అవి మమత బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలో పడేశాయి. స్పందన బెనర్జీ బయటికి రాలేక తప్పలేదు. కాకపోతే ఆమె డిఫెన్స్ చేస్తున్న విధానం ఓటర్లకు అంత ఈజీగా ఎక్కడం లేదు.. మెడికో విద్యార్థిని పై దారుణం.. అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఘోరాలు.. పెరిగిపోయిన అవినీతి.. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులను ఇబ్బంది పెట్టడం వంటి పరిణామాలు మమత బెనర్జీకి వ్యతిరేకంగా మారిపోయాయి.. అయితే వాటిపై క్లారిటీ ఇవ్వడంలో మమత పూర్తిగా విఫలమవుతున్నారు. అందువల్లే ఎన్నికల ప్రచారంలో ఆమె మునుపటి జోరు చూపించలేకపోతున్నారు.
ఇక బిజెపి కూడా ప్రచార శైలిలో కాస్త దూకుడు చూపిస్తున్నప్పటికీ.. ప్రజలను మెప్పించే స్థాయిలో అది సాగలేకపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నప్పటికీ.. బిజెపికి ఏకపక్షంగా సీట్లు వచ్చే పరిస్థితి లేదని అనేక రకాలైన విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. అటు అధికార తృణమూల్ కాంగ్రెస్.. ఇటు ప్రతిపక్ష బిజెపి హోరా హోరిగా పోరాడుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నప్పటికీ 11 జిల్లాలోని 70 స్థానాలే బెంగాల్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని విశ్లేషణలను వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 70 నియోజకవర్గాలలో అటు బిజెపి.. ఇటు తృణమూల్ కాంగ్రెస్ చావో రేవో అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ బిజెపి గనుక అధికారంలోకి వస్తే మమతా బెనర్జీ అక్రమాలపై దర్యాప్తు చేపడతామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బెంగాల్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాదని.. బిజెపి మత రాజకీయాలకు బెంగాల్ ప్రజలు ఆకర్షితులు కాలేరని తృణమూల్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొన్నటిదాకా చేపల పంచాయతీ.. ఇప్పుడేమో 70 నియోజకవర్గాల వ్యవహారం.. మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు నిత్యం అటు జాతీయ మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూనే ఉన్నాయి.
