Weight Loss Medicine: ఒకప్పటి మాదిరిగా శారీరక శ్రమ లేదు. చెమట చిందించాల్సిన అవసరం లేదు.. అన్నింటికంటే ముఖ్యంగా ఒళ్ళు వంచకుండానే డబ్బులు సంపాదించే మార్గాలు అనేకం వస్తున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే కూర్చొని సంపాదించడం పెరిగిపోయింది. కూర్చొని తింటే కొండలైన కరుగుతాయి. అలాగే కూర్చుని పని చేసి, తింటే ఎంతటి శరీరంలోనైనా కొవ్వు నిలువలు పెరిగిపోతాయి.
శరీరంలో కొవ్వు పెరిగిపోతే రూపం మారిపోతుంది. స్థూలంగా చెప్పాలంటే స్థూలకాయత్వం వస్తుంది. స్థూలకాయత్వం ఒక్కసారి వచ్చిందా దానిని తగ్గించుకోవాలంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడాలి. చాలామంది ఆ స్థాయిలో శారీరక శ్రమ చేయకుండా వదిలేస్తుంటారు. శరీరాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక నిశ్శబ్దంగా ఉండిపోతారు. పదిమందిలోకి వెళ్తే పరువు పోతుందని భావించి చాలామంది ఔషధాలు వాడుతుంటారు.
ఒకప్పుడు స్థూలకాయత్వాన్ని తగ్గించే ఔషధాలకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్థూలకాయత్వం పెరిగిపోవడంతో ఔషధాలకు డిమాండ్ పెరిగిపోయింది.. దీనికి తోడు, అనేక కంపెనీలు బరువును తగ్గించే మందులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. బరువును తగ్గించే ఔషధాలను తయారు చేయడంలో విదేశీ కంపెనీలు ముందు వర్షలో ఉన్నాయి. విదేశాలకు చెందిన ఎల్లి లిల్లీ అనే కంపెనీ బరువును తగ్గించే ఔషధాలను తయారుచేస్తోంది.
ఈ కంపెనీ తయారు చేస్తున్న మందుల్లో టిర్టెపటైడ్ ఒకటి. నోవో నార్ డిస్క్ కు చెందిన సెమా గ్లూటైడ్ మరొక ఔషధంగా ఉంది. ఈ మందులను జిఎల్పి -1 కేటగిరి అని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. టిర్టెపటైడ్ ఔషధాన్ని మౌంజారో, జెప్ బౌండ్ అనే బ్రాండ్లతో ఎల్లి లిల్లీ కంపెనీ అమ్మకాలు చేపడుతోంది.
సెమా గ్లూ టైడ్ ను నొవా నార్డిస్క్ ఒజెంపిక్, వెగోవి అనే బ్రాండ్ల పేరుతో అమ్ముతోంది. డయాబెటిక్ కంట్రోల్ లో కూడా ఈ మందులను ఉపయోగిస్తారు. వేగోవి, జెప్ బౌండ్ బ్రాండ్లు స్థూలకాయతో సమస్య పరిష్కారానికి, ఒజెంపిక్ మౌంజారో బ్రాండ్ మందులను డయాబెటిక్ కంట్రోల్ కు కూడా వాడుతున్నారు. ఈ మందులు మనదేశంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే విపరీతమైన డిమాండ్ ను సొంతం చేసుకున్నాయి.
ఓవర్ వెయిట్ లాస్ మందులకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పేటెంట్ కొనసాగుతోంది. పేటెంట్ గొడవ తీరిపోగానే, జనరిక్ మందులను ఉత్పత్తి చేయాలని మనదేశంలో ఉన్న దిగ్గజ ఫార్మా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా సెమా గ్లూ టైడ్ మందు పై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే ఈ మందును ఉత్పత్తి చేసి, పేటెంట్ లేని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నాయని సమాచారం. సన్ ఫార్మా, రెడ్డీస్ లాబరేటరీస్, జైడస్ వెల్నెస్, టొరెంట్ ఫార్మా కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
దేశీయ ఫార్మా కంపెనీలకు అవకాశం ఇవ్వకూడదని నార్ డిస్క్, ఎలి లిల్లీ కంపెనీలు.. మన దేశానికి సంబంధించిన కొన్ని ఫార్మా కంపెనీలతో లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఎం క్యూర్ ఫార్మా కంపెనీతో నోవో, సిప్లా కంపెనీతో ఎలి లిల్లీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందాల ద్వారా జిఎల్పి -1 ఔషధాల మార్కెట్ విలువ అంతకంతకు పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జిఎల్పి మందుల వల్ల దేశీయ ఫార్మా పరిశ్రమ అభివృద్ధి నాలుగు నుంచి ఐదు శాతం వరకు ఉంటుందని ఇప్పటికే అనేక సంస్థలు వెల్లడించాయి.
మధుమేహ మందుల విభాగంలో విక్రయాలు సాగిస్తున్న కంపెనీలకు ఈ పరిణామం మేలు చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. సెమా గ్లూ టైడ్ మందుకు మన దేశంతో పాటు తుర్కియే, బ్రెజిల్, కెనడా దేశాలలో వచ్చే ఏడాది మార్చిలో గడువు తీరిపోనుంది. ఐరోపాదేశాలలో 2026 -32 కాలంలో, ఆ తర్వాత అమెరికాలో ఈ మందుకు పేటెంట్ గడువు ముగుస్తుంది. దీంతో ఈ ప్రాంతాలలో భారతీయ కంపెనీలు జనరిక్ మందులు అమ్మడానికి అవకాశం ఉంటుంది.