MLA Marri Janardhan Reddy: అడుసు తొక్కితే కాలును కడుక్కోగలం. నోరు జారితే ఆ మాటను వెనక్కి తీసుకోలేం. మిగతా వారి విషయంలో ఏమోగాని ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాటలోనూ హుందాతనాన్ని ప్రదర్శించాలి. ఎక్కడా కూడా నోరు జారకూడదు. అధికార పార్టీలో ఉన్నామని ఇష్టానుసారంగా ప్రదర్శించకూడదు. మరీ ముఖ్యంగా సభలు, ఆవేశాల్లో అయితే ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇవేవీ పట్టకుండా నా ఇష్టం నేనింతే అని వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది.
100కు పైచిలుకు ఎమ్మెల్యేలు ఉన్న భారత రాష్ట్ర సమితిలో మర్రి జనార్దన్ రెడ్డి అనే ఎమ్మెల్యే అగర్బ శ్రీమంతుడు. వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ వేలకోట్లకు పడగలెత్తాడు. ఆ మధ్య ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మీడియా బయటకు చెప్పలేదు కానీ లెక్కకు మిక్కిలి ఆస్తులు తనిఖీలో వెలుగు చూడటంతో అధికారులు వాటిని సీజ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ ఆయనకు లెఫ్ట్ రైట్ క్లాస్ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. పైగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు సీటు ఉంటుందో లేదోననే ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే ఆయన తన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నారు. ఒక్క అడుగు కూడా బయటకు వేయడం లేదు. దండిగా డబ్బులు ఉండడంతో నియోజకవర్గంలో ఇప్పుడే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టినట్టుగా హడావిడి చేస్తున్నారు. ఈ హడావిడే ఆయనకు తలకాయ నొప్పులు తెచ్చిపెడుతోంది.
నిన్న ఆదివారం నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడారు.”కెసిఆర్ హైదరాబాదులో భూములు అమ్ముతున్నాడు. ఆ వచ్చిన డబ్బులతో మీ రుణాలు మాఫీ చేస్తున్నాడు. ఇప్పటినుంచి మీ సెల్ ఫోన్లు బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్ లతో టంగ్ టంగ్ అని మోగుతుంటాయి” అని వ్యాఖ్యానించాడు.. మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యల్లో అంతరార్థం తెలిసినవారు సైలెంట్ గా ఉండగా, మిగతావారు మాత్రం ఈ ఈలలు వేస్తూ గోల చేశారు. అయితే దీనిపై ప్రగతి భవన్ సీరియస్ గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి వ్యవసాయ రుణాల మాఫీ ఎన్నికల స్టంట్ అని ఒక సమావేశంలో మాట్లాడారు. దాన్ని మర్చిపోకముందే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో భూములమ్మి కెసిఆర్ రుణాలు మాఫీ చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేశాడు. మొన్నటి దాకా ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ గా ఉంటే భారత రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎన్నికలు కాబట్టి, వాళ్లకు టికెట్లు ఇచ్చేది లేదు కాబట్టి కెసిఆర్ ఏమన్నా సైలెంట్ గా ఉన్నాడా?!