అక్టోబర్ 14 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఒక్కో రాష్ర్టం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్మనీ కింద డిపాజిట్ చేయాలి. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. నోటిపికేషన్ అమల్లోకి వచ్చిన తరువాత అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి వస్తుంది.
కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు 2014లో కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేశారు. వీటి పరిధిని కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంది. కేంద్రానికి బోర్డులు ముసాయిదాలను పంపించాయి. అయితే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకుండా పరిధిని ఎలా నిర్ణయిస్తారని తెలంగాణ ప్రశ్న లేవనెత్తింది.
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతర్వాతే నిర్ణయించాలని కోరింది. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 811టీఎంసీల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ కోరింది. దీనిపై చివరిసారిగా గతేడాది అక్టోబర్ లో కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా, ఇద్దరు మంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ లో చర్చ జరిగింది. సీఎంల అభిప్రాయాల తరువాత బోర్డుల పరిధులపై తామే నిర్ణయాలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. ఆ మేరకు తాజా నోటిఫికేషన్ విడుదలైంది.
బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శి, చీప్ ఇంజనీర్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన వారు ఉండకూడదని తాజా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంటే ఏపీ, తెలంగాణ కాకుండా ఇతర స్టేట్లకు చెందిన చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ కు సంబంధించిన నిర్వహణ విది విధానాలను రెండు రాష్ర్టప్రభుత్వాలు, బోర్డు సంయుక్తంగా తయారు చేయాల్సి ఉంది. నిర్వహణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలను బోర్డులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.