Homeజాతీయ వార్తలుTelangana New Secretariat: తెలంగాణ వైట్ హౌస్.. ఒక్కవానకే ఇలా కురుస్తుందే?

Telangana New Secretariat: తెలంగాణ వైట్ హౌస్.. ఒక్కవానకే ఇలా కురుస్తుందే?

Telangana New Secretariat: ఉన్న సచివాలయాన్ని రాత్రికి రాత్రి పడగొట్టారు. అంతటి కరోనా సమయంలో మూడో కంటికి తెలియకుండా నిర్మాణ పనులు చేశారు. 23 ఎకరాల విస్తీర్ణంలో, 1600 కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించారు. ఇందులోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. ఉత్తరాది మీడియాకు రెడ్ కార్పెట్ పరిచారు. ఇలా సెక్రటేరియట్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వం చేసిన పనులు మామూలువికావు. అసలు ప్రభుత్వం ఇలా ఎందుకు చేసింది? ఏ వాస్తవాలను దాచి పెట్టేందుకు ఇలాంటి ఆంక్షలు విధించింది? ఇవన్నీ తరచి చూస్తే అర్థమైంది ఏమిటంటే సచివాలయం ఒక లోపాల పుట్ట అని.

ఎందుకు ఇలా జరుగుతోంది

యాదగిరి గుట్టను అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒక గట్టి వర్షానికి ఆలయంలోకి నీళ్లు వస్తున్నాయి. లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాలేశ్వరం పంప్ హౌస్ మోటర్లు నీట మునిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి నూతన సెక్రటేరియట్ చేరింది. ప్రభుత్వం ఇన్ని గొప్పలు చెప్పుకుంటున్న వేళ.. ఈ లోపాలు ఒక్కొక్కటిగా కళ్ళకు కడుతున్నాయి. దీనిని భారత రాష్ట్ర సమితి నాయకులు ఖండించవచ్చు గాక.. అనుకూల మీడియాతో ప్రతిపక్షాల గొంతులు మూయవచ్చు గాక. కానీ యదార్ధం ఏమిటి అనేది ప్రజలకు తెలుస్తూనే ఉంటుంది. ఇంతమంది నోళ్ళు మూయించగలిగిన ప్రభుత్వం.. సోషల్ మీడియాను కట్టడి చేయగలదా? ఏదో ఒక రూపంలో సచివాలయంలోని డొల్లతనాన్ని అది బయటపడుతూనే ఉంటుంది.

Telangana New Secretariat
మీడియా సెంటర్ పిల్లర్ల నుంచి కారుతున్న నీరు, శ్లాబ్ పైన ఏర్పడిన చిన్న చిన్న పగుళ్లు

కురుస్తున్నాయి

ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం సచివాలయంలోని డొల్ల తనాన్ని బయటపెట్టింది. సచివాలయంలో భాగంగా నిర్మించిన మీడియా సెంటర్లోకి నీరు చేరి, నిర్మాణ సంస్థ పనితీరుని వెక్కిరించింది. గతంలో సచివాలయం మొదటి అంతస్తు నుంచి నీరు లీక్ అయింది. తాజాగా అకాల వర్షాలతో పిల్లర్లగుండా నీరు లీకై, నిర్మాణ సాంకేతికతలో లోపాలను బయటపెట్టింది. తాజాగా మీడియా సెంటర్ లోకి నీరు లీక్ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక్క వర్షానికే మీడియా సెంటర్ లోకి వాన నీరు చేరి, పాత్రికేయులు నిల్చునే పరిస్థితి లేకుండా పోయింది. శ్లాబ్ పైనుంచి పిల్లర్ల మీదుగా నీరు కారి హాలు మొత్తం నిండిపోయింది. పిల్లర్లకు సన్నటి పగుళ్లు ఏర్పడటం నీరు లీక్ కావడానికి కారణమైంది. శ్లాబ్ కు చెమ్మ పట్టి బొట్లు బొట్లుగా ఫ్లోరింగ్ పైకి చేరింది. ఈ ఘటన మీడియా సెంటర్ నిర్మాణంలో లోపాలను కళ్ళకు కట్టింది.

Telangana New Secretariat
వర్షానికి కురుస్తున్న సచివాలయం మొదటి ఫ్లోర్

అదే అశ్రద్ధ

వందల కోట్లు వెచ్చించి నిర్మించిన సచివాలయంలో మీడియా సెంటర్ ను కూడా అదే జాగ్రత్తతో నిర్మించాల్సి ఉంది. కానీ మూడు సంవత్సరాల నుంచి మీడియాను దూరం పెడుతున్న ప్రభుత్వం.. మీడియా సెంటర్ విషయంలోనూ అదే నిర్లక్ష్యాన్ని కనబరిచింది. నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించలేదు. పనులు ముగించాలని తొందరలో ఇలా జరిగి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త సచివాలయానికి వచ్చే ఉద్యోగుల మనోభావాలు తెలుసుకునేందుకు మీడియా సెంటర్ కు వెళ్లిన పాత్రికేయులు అక్కడ నిలిచిన నీటిని చూసి అవాక్కయ్యారు. ఇప్పుడే ఇలా ఉంటే.. వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది. గతంలో బి ఆర్ కే భవన్ లో ఉద్యోగులు ఇరుకు గదుల్లో విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. అప్పుడు మీడియాకు అవకాశం ఇస్తే ఉద్యోగుల అభిప్రాయాలతో లొసుగులు మొత్తం బయట పెడతారనే కారణంతో అవకాశం ఇవ్వలేదు. కనీసం కొత్త సచివాలయంలోనైనా మీడియాకు అవకాశం కల్పిస్తారని భావించారు. కానీ ప్రభుత్వం ఇక్కడ కూడా సరికొత్త ఆంక్షలు అమలు చేస్తోంది. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పుకుంటున్నప్పుడు మీడియాపై ఇన్ని ఆంక్షలు ఎందుకని అధికార పార్టీ నాయకులను ప్రశ్నిస్తే.. వారు సమాధానం చెప్పేందుకు వెనకాడుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular