తెలుగు ప్రాంతాల్లో జల వివాదం ముదురుతోంది. ఒకరిపై మరొకరు విమర్శించుకునే వరకు వెళ్తున్నారు. ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని సీఎం కేసీఆర్ విమర్శిస్తే దానికి ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. దాదాగిరి ఎవరు చేస్తున్నారో తెలుస్తోందని పేర్కొంటున్నారు. దీంతో రెండు ప్రాంతాలు నీళ్ల కోసం పంచాయితీలు పెట్టుకునే వరకు లాగుతున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయ నిప్పులు రాజేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ నిర్వాకం వల్ల 30 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి.
గతంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య అవగాహనతో లావాదేవీలు కొనసాగాయి. జల వివాదాలకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి తన ఓఎస్డీ గా తెలంగాణ జైళ్ల శాఖ అధికారిని నియమించుకోవాలనుకున్నారు. దానికి తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోగానే ఆమోదం వచ్చింది. తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటున్న స్కూళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి సాఫ్ట్ వేర్ నాడు నేడు తెలంగాణ సర్కారు వాడుకునేందుకు ఏపీ ఎన్వోసీ ఇచ్చింది. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉందని తెలుస్తోంది.
జల వివాదాల విషయంలో రెండు ప్రభుత్వాలు గొడవలకు దిగుతున్నాయి. వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని తెగేదాకా లాగుతున్నాయి. తెలంగాణ సర్కారు చేస్తున్న విమర్శలపై సజ్జల తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. నదీ జలాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్న తరువాత కూడా విమర్శలు ఆగకపోవడంపై అందరిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజకీయం కోసం ఇవన్నీ చేస్తున్నారని ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. కూర్చుని మాట్లాడుకుంటే పోయే దాన్ని పట్టుకుని ఇంతలా లాగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన నేపథ్యంలో పాలకులు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.