Janasena Vs YSRCP: పవన్, వైసీపీల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాజకీయాలను పక్కనబెట్టి వ్యక్తిగత దూషణలకు దిగేస్థాయికి దిగజారింది. పవన్ చేసిన కామెంట్స్.. వైసీపీ నేతల రియాక్షన్… అన్నీ కలిపి ఆంధ్రాలో ఓ పెద్ద దుమారమే రేగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ… జనసేన యూత్లో మాంచి ఫాలోయింగ్ ఉన్న పార్టీ… రెండూ కలిసి ట్వీట్ యుద్ధానికి తెరలేపాయి. చివరికి ఆ వార్ ఓ సామాజిక వర్గానికి చుట్టుకునేలా ఉంది. పార్టీలు, స్వార్థ ప్రయోజనాల కోసం జరిగే యుద్ధంలో ఆ సామాజిక వర్షం బలైపోతోందా? అనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.

‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీ ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో సినిమాపై నియంత్రణ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ గురించి ప్రతిఒక్కరూ మాట్లాడడం తనను బాధకు గురిచేస్తోందని చెప్పారు. వకీల్సాబ్ సినిమా దిల్ రాజుతో చేయకపోతే.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు విడుదలై ఉండేవని తెలిపారు. కావాలంటే తన సినిమాలు ఆపాలని.. మిగతా వారి సినిమాలను వదిలెయ్యాలని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమ చిన్నది అనుకుంటున్నారేమో! దీని బడ్జెట్ తక్కువేమో, ప్రభావం చాలా పెద్దదని పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా. చిత్ర పరిశ్రమవైపు కన్నెత్తి చూడకండి. కాలిపోతారు జాగ్రత్త.” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మాటలే ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్కి కారణమయ్యాయి.
పవన్ కళ్యాణ్ అంతటితో ఆగలేదు. వైసీపీపై ట్వీట్ వార్కు దిగారు. ‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’ అంటూ ఘాటుగా ట్వీటారు. దీంతో పాటు ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు. దీనిపై వైసీపీ తనదైన శైలిలో స్పందించింది. పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు నమస్కారాలు’ అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు.
వైసీపీ తెలిసిగా పేర్ని నానిని రంగంలోకి దింపింది. పవన్ సామాజికవర్గం, నాని సామాజిక వర్గం ఒక్కటే కావడంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నానితోపాటు మరికొందరు వైసీపీ నేతలు స్పందించినప్పటికీ విషయం మాత్రం పూర్తిగా డైవర్ట్ అయిపోయింది. పవన్, వైసీపీల మధ్య మాటల యుద్ధం.. ఓ వర్గానికి ప్రాణసంకటంగా మారింది. పేర్ని నాని మాట్లాడుతూ.. పదే పదే పవన్ నా చుట్టమే.. మేమిద్దరం కాపులమే… మేమూ మేమూ ఒక్కటే.. వంటి కామెంట్లు ఆ సామాజిక వర్గాన్ని ఇరకాటంలోకి నెట్టాయి.
పవన్, పేర్ని నాని వారి స్వర్థ ప్రయోజనాల కోసం తమను రోడ్డుకు లాగారని కొందరి కాపు కులస్థులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సినిమా టికెట్ల ఆన్లైన్కి కాపు కులానికి సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. కాపుల కోసం పవన్ చేసిందేమీ లేదని, మంత్రివర్గంలో ఉండి పేర్ని నాని చేసిందేమీ లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై కాపు కీలక నేతలంతా భేటీ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి… ఈ పంచాయితీ ఎక్కడి వరకూ దారితీస్తోంది?