Walkie Talkie Sale Ban : భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఆన్‌లైన్ వాకీ టాకీల అమ్మకాల మీద కఠిన చర్యలు తీసుకుంది.ప్రభుత్వం అనేక ఈ కామర్స్ వెబ్‌సైట్‌లకు నోటీసులు పంపి, అటువంటి పరికరాల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై అందుబాటులో ఉన్న వాకీ-టాకీల అమ్మకాలపై నిషేధం విధించింది.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. దీని తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే CCPA భద్రతాపరమైన ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై వాకీ టాకీ పరికరాల అమ్మకాలను నిలిపివేసింది. లైసెన్స్ లేకుండా వాకీ టాకీ వంటి వాటిని విక్రయిస్తున్నారని, ఇది వైర్‌లెస్ కమ్యూనికేషన్ నిబంధనలకు విరుద్ధమని CCPA తెలిపింది. ఈ పరికరాలు సులభంగా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది.దీనివల్ల జాతీయ భద్రతకు నష్టం వాటిల్లవచ్చు. ముఖ్యం భారత్-పాక్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు.
Also Read : ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్.. ఆ నంబర్లకు సంప్రదించవచ్చు!
నివేదికల ప్రకారం.. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై వాకీ టాకీలు ఎటువంటి ధృవీకరణ లేకుండా అమ్ముతున్నాయి. అటువంటి ప్లాట్‌ఫారమ్‌లు వెంటనే ఈ ఉత్పత్తులను తొలగించాలని, భవిష్యత్తులో అనుమతి లేకుండా విక్రయించవద్దని CCPA ఆదేశించింది. అలాగే, చట్టవిరుద్ధంగా ఉపయోగించే పరికరాలను కొనుగోలు చేయవద్దని వినియోగదారులను కూడా హెచ్చరించింది. ఈ చర్య భద్రతను బలోపేతం చేయడమే కాకుండా తప్పుడు వ్యక్తులను కూడా కంట్రోల్ చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి ప్రకటన
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేస్తూ ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు. మార్కెట్‌లో అనేక పరికరాలు వాటి ఫ్రీక్వెన్సీ గురించి సమాచారం లేకుండా విక్రయించబడుతున్నాయని ఆయన అన్నారు. వాటికి లైసెన్స్ ఉందా లేదా లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్నారా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని కూడా ఆయన పేర్కొన్నారు.