Vundavalli Aruna Kumar: గెలుపోటములతో సంబంధం లేకుండా లైమ్ లైట్ లో ఉండే నాయకులు చాలా అరుదు. చాలామంది రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి.. అనతికాలంలోనే కనుమరుగవుతంటారు. మరికొందరు పవర్ లో లేకపోయినా ప్రజా సమస్యలపై తమ వాణిని వినిపించి అటు మీడియాలో, ఇటు ప్రజల నాలుకలో నానుతుంటారు. ఇటువంటి నాయకుల జాబితాలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. తటస్థంగా ఉన్నారు. స్వతహాగా కాంగ్రెస్ వాది అయిన ఆయన రాష్ట్ర విభజన సవ్యంగా జరపలేదని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అలాగని ఏ పార్టీలో చేరలేదు. ఇప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పై విమర్శలు చేయడానికి ఉండవల్లి వెనుకడుగు వేయరు. జనసేన పార్టీతో పాటు అధినేత పవన్ కళ్యాణ్ పై మాత్రం సానుకూలత ప్రదర్శిస్తారు. పవన్ పై అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు.

అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై నిత్యం విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సో ఆయన బీజేనీ వైపు వెళ్లే చాన్స్ లేదు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి, సీఎం జగన్ తీసుకుంటున్ననిర్ణయాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. అంటే వైసీపీలోకి వెళ్లే ఉద్దేశ్యం లేదు. పోనీ టీడీపీలోకి వెళతారంటే సుదీర్ఘ కాలం ఆ పార్టీతో పోరాటం చేశారు. పైగా సైద్ధాంతికంగా కుదరదు. కాంగ్రెస్ లోకి రీబ్యాక్ అవుదామంటే ఆ పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. సో ఉండవల్లి ముందున్న ఆఫ్షన్ జనసేన ఒక్కటే. పైగా పవన్ అంటే అభిమానమున్న దృష్ట్యా ఆయన జనసేనలో చేరిక ఖాయమని రాజకీయవర్గాలు విశ్లిషిస్తున్నాయి.

కొద్దిరోజుల కిందట ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. జాతీయ పార్టీ ఏర్పాట్లపై బీజీగా ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సమైఖ్యాంధ్ర ఉద్యమంలో ఉండవల్లి గట్టి వాయిస్ వినిపించడం, కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని తప్పుపట్టి అసలు సిసలు సమైఖ్యవాదిగా గుర్తించబడ్డారు. అటువంటి వ్యక్తితో కేసీఆర్ చర్చలు జరపడం తెలంగాణలో విమర్శలు వచ్చాయి. అయితే తన జాతీయ పార్టీ విస్తరణలో భాగంగా ఏపీ బాధ్యతలు ఉండవల్లికి అప్పగిస్తారని టాక్ అయితే నడిచింది. కానీ ఉండవల్లి మాత్రం తిరస్కరించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆయన రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకు జనసేన వేదికగా నిర్థారించుకున్నట్టు తెలుస్తోంది. సో త్వరలో ఉండవల్లి జనసేన నుంచి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారన్న మాట.