Jubilee Hills Housing Society: పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు.. 90 వ దశకంలో ఓ కవి అన్న మాటలు ఇవి. ప్రస్తుతం పత్రికల పక్కన ఛానళ్లు అని కూడా పెట్టుకోవాలేమో.. అంతగా దిగజారి పోయాయి మరి. ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో ఛానల్. ఎవరు సత్య వంతులు గనుక. పొద్దున లేస్తే ఎవరి డప్పు వారు కొట్టుకోవడమే. గిట్టని వారి మీద బురద చల్లడమే. ఇందులో పనిచేస్తున్న జర్నలిస్టుల గురించి చెప్పాల్సిన పని లేదు. నడి బజార్లో నిలుచుని పోతురాజుల్లాగా చర్నాకోలతో కొట్టుకుంటారు. ఆ టాంపరింగ్లు మన్నుమశానం పక్కన పెడితే.. ఎన్టీవీ, టీవీ 5 ఛానళ్ళు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కానీ ఈ సంస్థల చైర్మన్లు చేస్తున్న పనులే ఏవగింపు కలిగేలా చేస్తున్నాయి. తాగి తందనాలాడే ఒక క్లబ్ గురించి, కోట్లల్లో ధర పలికే సొసైటీ భూముల గురించి వీరు కొట్టుకున్న తీరు చూస్తే.. వీళ్ళా ఛానళ్ళ ఎండి లు అనే స్థాయికి పడిపోయారు.

జూబ్లీహిల్స్ సొసైటీలో రచ్చ రచ్చ
తెలుగు టీవీ ఛానళ్ళలో పై ఎన్టీవీ, టీవీ5, సివిఆర్ న్యూస్ ఛానల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ5ని బిఆర్ నాయుడు నిర్వహిస్తున్నారు. ఈయనకు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. వందల కోట్లకు పడగలెత్తారు. ప్రస్తుతం టిడిపికి డప్పు కొడుతున్నారు. ఇక ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిది మరోచరిత్ర. ఎక్కడో ఖమ్మంలో పుట్టిన ఈయన పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్. తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఎన్టీవీ అనే ఛానల్ ను ప్రారంభించారు. దీనికి తోడు భక్తి, వనిత టీవీ అనే ఛానళ్ళను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్టీవీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఈ ర్యాంకు వచ్చిందనే విమర్శలూ లేకపోలేదు. ఇక సివిఆర్ ఛానల్ ఎండికి మాదాపూర్ లో ఇమేజ్ హాస్పిటల్ ఉంది. ప్రస్తుతం ఈ ఛానల్ నష్టాల్లో ఉంది. సిబ్బందికి వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సరే ఇదంతా పక్కన పెడితే ఈ ఛానళ్ళ ఎండి లకు సంబంధించిన ఒక విషయం మీడియా సర్కిళ్ళల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. సదరు చానళ్ల ఎండిలు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో సభ్యులు. సొసైటీని అడ్డం పెట్టుకొని చాలామంది కోట్లకు కోట్లు కూడ పెట్టుకున్నారన్న ప్రచారం ఉంది.

ఇప్పుడు ఆ సొసైటీ విషయంలో ఈ చానళ్ళ ఓనర్ల మధ్య ఒకరికి ఒకరికి పడటం లేదు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ సొసైటీ టీవీ 5 చైర్మన్ బీ ఆర్ నాయుడు కుమారుడి చేతిలో ఉంది. ఇటీవల ఆయన సివిఆర్ న్యూస్ ఛానల్, ఎన్టీవీ చైర్మన్ ను సొసైటీ నుంచి తొలగించారు. వారు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ క్లబ్ నుంచి టీవీ5 ఓనర్ బిఆర్ నాయుడు, ఆయన కుమారుడితోపాటు మద్దతుగా ఉండే వారిని తొలగిస్తున్నామని సివిఆర్ ప్రకటించారు. ఇప్పుడు వారు కూడా కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ రచ్చతో టీవీ ఛానల్ యజమానులు తామేం సుద్ధ పూసలం కాదని నిరూపించుకున్నారు. మీడియా అంటేనే బయాస్డ్ న్యూస్ గా మారిన ఈ ముగ్గురి వ్యవహారంలో బాగానే సెటైర్లు పడుతున్నాయి. ఓ సొసైటీ, క్లబ్ మెంబర్షిప్ లు, అందులో ఆధిపత్యం కోసం వందల కోట్ల ఆస్తిపరులైన వీరు సమాజంలో తమ పేరు ప్రతిష్టలను కూడా పణంగా పెట్టి ఎందుకు పోరాడుతున్నారనేది చర్చనీయాంశమవుతోంది. పొద్దున లేస్తే చెప్పేది నీతులు. కానీ చేస్తోంది మాత్రం వేరు. అసలు రెండు గ్రూపుల్ని పక్కన పెట్టి ప్రభుత్వం ఆ సొసైటీలో, క్లబ్ లో ఏం జరుగుతుందో తేల్చాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.