VRO’s Concern: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌వో వ్యవస్థను ప్రభుత్వం ఏడాది క్రి తం రద్దు చేసింది. ఎలాంటి పని లేకుండానే ఏడాదిపాటు వీరికి జీతాలు ఇచ్చింది. దీనిపై గతంలో కొంతమంది కోర్టును ఆశ్రయించగా పనిలేకుండా జీతాలు ఎలా ఇస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. దీంతో స్పందించిన ప్రభుత్వం వీఆర్వోలను ప్రభుత్వంలోని 17 శాఖల్లో సర్దుబాటు చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో 121 జారీ చేసింది. అయితే ఈ జీవోలో సీనియారిటీ, ఉద్యోగ భద్రతపై స్పష్టత లేకపోవడం, లాటరీ పద్ధతిలో శాఖలు కేటాయించడంపై వీఆర్వోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టును ఆశ్రయించినా..
వీఆర్వోల సర్దుబాటుపై ప్రభుత్వం జారీ చేసిన 121 జీవోలో తమ సీనియారిటీ, ఉద్యోగ భద్రతకు సంబంధించిన విషయాలు లేవని, దీనిని కొట్టివేయాలని, సర్దుబాటు తీరు కూడా సరిగా లేదని వీఆర్వోల సంఘం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోపై స్టే ఇచే ్చందుకు నిరాకరించింది. అయితే దీనిపై విచారణ మాత్రం చేపడతామని తెలిపింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో వీఆర్వోలు నిరాశ చెందారు. అయినా తుది తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారు.
Also Read: Next CJI Justice Lalit: కాబోయే ప్రధాన న్యాయమూర్తి లలిత్.. ఆయన చెప్పిన సంచలన తీర్పులు ఏవో తెలుసా..?
విధుల్లో చేరక తప్పని పరిస్థితి..
కోర్టు 121 జీవోపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో వీఆర్వోలు జూనియర్ అసిస్టెంట్లుగా తమకు కేటాయించిన శాఖల్లో చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జీవో వచ్చి రెండు రోజులు గడిచింది. వారికి కేటాయించిన శాఖల్లో తక్షణమే జాయిన్ కావాలని కలెక్టర్లు ఆదేశించారు. కానీ జీవోలో పేర్కొన్న అంశాలు, సర్దుబాటు తీరుపై అసంతృప్తితో ఉన్న వీఆర్వోలు విధుల్లో చేరలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా స్టే రాకపోవడంతో ఇప్పుడు విధుల్లో చేరక తప్పని పరిస్థితి నెలకొంది. తీర్పు వచ్చిన వెంటనే చాలామంది తమకు కేటాయించిన శాఖల్లో జాయిన్ అయ్యారు. ఒకటి రెండు రోజుల్లో అందరూ చేరతారని అధికారులు భావిస్తున్నారు.
రంగంలోకి రాజకీయ పార్టీలు..
వీఆర్వోల సర్దుబాటు తీరుపై కోర్టు స్టే ఇవ్వకపోవడంతో.. ఆ సంఘం నాయకులు విపక్ష పార్టీలను ఆశ్రయించారు. 121 జీవోలో లోపాలు, సర్దుబాటు తీరు, తమకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష నాయకులకు వివరించారు. దీంతో వీఆర్వోల తరఫున, జీవో 121కు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.

జీవో 317 కు వ్యతిరేకగా బీజేపీ పోరాటం..
గతంలో ఉపాధ్యాయుల బదిలీకి సబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 317కు వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారా విపక్షాలకు మంచి మైలేజీ వచ్చింది. ముఖ్యమంగా భారతీయ జనతాపార్టీ ఈ జీవోపై పోరాడిన తీరు ఉపాధ్యాయులకు కొంత భరోసా ఇచ్చింది. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లోని తన స్వగృహంలో 317 జీవోకు వ్యతిరేంగా నిరసన దీక్షకు సిద్ధమవ్వడం, దానిని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పోలీసులను పురమాయించడం, ఇంట్లో చేస్తున్న దీక్షపై వాటర్ క్యానన్లు ప్రయోగించడం, చివరకు బండి సంజయ్ జైలుకు వెళ్లడం వంటి అంశాలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇదే సమయంలో బీజేపీకి మైలేజీ పెంచాయి. మరోవైపు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 121 జీవోపై కూడా ఇలాంటి పోరాటం చేస్తే తమకు న్యాయం జరుగుతుందని వీఆర్వోలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సంఘం నాయకులు విపక్ష పార్టీలను కలిశారు. దీంతో 121 జీవోపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. మొత్తంగా వీఆర్వోల ఆందోళన త్వరలోనే పొలిటికల్ టర్న్ తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: LIC: బీమా సంస్థకు గ్లోబల్ గుర్తింపు… ఎల్‌ఐసీ సరికొత్త రికార్డు