తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసింది. రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ లకు ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 గంటలలోగా రికార్డులను కలెక్టరేట్ లో అప్పగించాలని వీఆర్వోలకు స్పష్టం చేశారు. కలెక్టర్ల నుంచి సాయంత్రంలోగా సమగ్ర నివేదిక రావాలని ఆదేశించారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముసాయిదా బిల్లును ఇవాళ్లి నుంచే జరిగే సమావేశాల్లో పెడుతారని అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో రెవెన్యూశాఖలో భారీగా అవినీతి పెరిగిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఏసీబీ దాడుల్లో వీఆర్వోలే పెద్ద ఎత్తున లక్షల్లో డబ్బు తీసుకుంటూ దొరికిపోతున్నారు. ఈ క్రమంలోనే అవినీతితో పంకిలమైన వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 7172 మంది వీఆర్వోలున్నారు. అందులో 5వేల మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీరిని ఏ శాఖలో విలీనం చేస్తారు? ఎక్కడ సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక నుంచి పంచాయితీ కార్యదర్శులకే ఈ బాధ్యతలు అప్పగిస్తారని.. సర్వం ఆన్ లైన్ చేస్తారని తెలుస్తోంది.