https://oktelugu.com/

Telangana Elections 2023: గ్రేటర్ లో ఓటర్ల మొగ్గు ఎటువైపు?

గ్రేటర్ హైదరాబాద్ అంటే విభిన్న ప్రాంతాల సమాహారం. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. దీంతో దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయం వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 27, 2023 / 03:50 PM IST
    Follow us on

    Telangana Elections 2023: తెలంగాణలో పోలింగ్ సమీపిస్తోంది. ప్రచార పర్వానికి కొన్ని గంటల వ్యవధి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపు మాదంటే మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓటర్ నాడీ తెలియక లోలోపల గుబులు పడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ దూకుడు మీద ఉండగా.. కాంగ్రెస్ పార్టీ పడి లేచిన కెరటంలా పోరాడుతుంది. బిజెపి సైతం జనసేనతో పొత్తు పెట్టుకుని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. అయితే గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో గెలుపోటములు ఉత్కంఠను రేపుతున్నాయి.

    గ్రేటర్ హైదరాబాద్ అంటే విభిన్న ప్రాంతాల సమాహారం. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. దీంతో దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయం వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తం 24 సీట్లు ఉండగా.. మజ్లిస్ పార్టీ కచ్చితంగా ఆరు సీట్లను గెలుచుకుంటుంది. నాంపల్లి లో ఈసారి కుదిరే పని కానట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మూడుసార్లు పోటీ చేశారు. ఓటమి ఎదురు కావడంతో ఆయనపై సానుభూతి పనిచేస్తోంది. కాంగ్రెస్ అనుకూల పవనాలు నేపథ్యంలో మరోసారి ఆయన బరిలో దిగడంతో గెలుపు ఖాయమన్న సంకేతాలు వెలవడుతున్నాయి. దాదాపు గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న మిగతా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది.

    అయితే ఈసారి సెటిలర్స్ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సెటిలర్స్ గెలుపోటములను నిర్దేశించనున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం వరకు గ్రేటర్ లో బీఆర్ఎస్కు కనీసం పట్టు లేదు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం పోటీ చేయని సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుచుకున్నది కేవలం మూడు సీట్లు మాత్రమే. 2018 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ ఏకంగా 14 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

    కాంగ్రెస్ పార్టీ సైతం గ్రేటర్ లో దారుణంగా దెబ్బతింది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో 14 స్థానాలను గెలుచుకుంది. 2018లో మాత్రం రెండు స్థానాలకే పరిమితమైంది. ఈసారి ఆర్థికంగా, సామాజికపరంగా గట్టి అభ్యర్థులను పోటీలో పెట్టింది. అందుకే గ్రేటర్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని కాంగ్రెస్ నాయకత్వం ధీమాతో ఉంది. 24 స్థానాలకుగాను.. సగానికి పైగా స్థానాలు గెలుచుకుంటామని భావిస్తోంది.వివిధ రకాల సమీకరణలు తమకు కలిసి వస్తాయని చెబుతోంది.

    అటు బిజెపి సైతం గ్రేటర్ లో మెజారిటీ స్థానాలు తమవేనని చెప్పుకొస్తుంది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆ పార్టీ 48 స్థానాలు గెలుచుకోవడంతో.. ఈసారి మెజారిటీ స్థానాలు తమవేనని భావిస్తోంది. ముఖ్యంగా గోషామహల్, ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి తదితర నియోజకవర్గాల్లో గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేస్తోంది.

    ప్రధానంగా సెటిలర్స్ ఎటువైపు మొగ్గు చూస్తే ఆ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువ. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. నాయకులు దూరమైనా.. ఆ పార్టీకి క్యాడర్ ఉంది. అయితే ఎన్నికల్లో టిడిపి ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు టిడిపి జెండాలు కనిపించేలా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ సైతం ఎక్కడికక్కడే ఇదే ఎత్తుగడను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ లో మెజారిటీ స్థానాలు దక్కించుకునే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ ఆలోచనతోనే ఆ 24 నియోజకవర్గాలపై మూడు పార్టీలు ఫోకస్ పెట్టాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.