Vizianagaram Political Ground Report
Vizianagaram: విజయనగరం జిల్లాలో ఈసారి హోరాహోరీ ఫైట్ ఉంటుంది. గత ఎన్నికల్లో 9 నియోజకవర్గాలకు గాను.. అన్నింటినీ వైసిపి స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. అటు విజయనగరం పార్లమెంట్ స్థానం సైతం వైసీపీ కైవసం అయింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. జనసేన, బిజెపితో పొత్తు ఉండడంతో దాదాపు అన్ని స్థానాలను గెలుచుకుంటామన్న ధీమాలో టిడిపి ఉంది.
ఉమ్మడి జిల్లాలో విజయనగరం, ఎస్. కోట,బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల,చీపురుపల్లి, పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అన్ని నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులను ఖరారు చేసింది. దాదాపు పాతవారినే అభ్యర్థులుగా ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకు కేటాయించింది. విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, రాజాం, పార్వతీపురం, కురుపాం, సాలూరు అభ్యర్థులను ఖరారు చేసింది. ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టింది.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఉండగా.. టిడిపి అభ్యర్థిగా అదితి గజపతిరాజు ఉన్నారు. గత ఎన్నికల్లో కోలగట్ల అదే అదితి గజపతిరాజు పై గెలుపొందారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు పెరిగాయి. దీంతో ఇక్కడ టిడిపి గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
గజపతినగరం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్యకు వైసీపీ హై కమాండ్ సీట్ కేటాయించింది. టిడిపి టికెట్ ను మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆశించారు. కానీ హై కమాండ్ మాత్రం ఆయన సోదరుడి కుమారుడు శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది. దీంతో ఇక్కడ అప్పలనాయుడు సహకారం బట్టి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే హోరాహోరీ ఫైట్ ఉంటుందని మాత్రం తెలుస్తోంది.
బొబ్బిలిలో టిడిపి టికెట్ను రాజ కుటుంబానికి చెందిన బేబీ నాయనాకు దక్కింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంభంగి వెంకట చిన అప్పలనాయుడు మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టిడిపి వేవ్ కనిపిస్తోంది. ఆ పార్టీలో చేరికలు సైతం పెరుగుతున్నాయి.
నెల్లిమర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు.లోకం మాధవిని అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కు టికెట్ దక్కింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఉంది. ఆ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తే జనసేన అభ్యర్థి లోకం మాధవి విజయం సాధించే ఛాన్స్ కనిపిస్తోంది.
రాజా నుంచి మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్ టిడిపి అభ్యర్థిగా ఖరారు అయ్యారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కంబాల జోగులకు స్థానచలనం తప్పలేదు. ఆయన స్థానంలో డాక్టర్ తలే రాజేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు జగన్. గత రెండు ఎన్నికల్లో కొండ్రు ఓటమి తో ఆయనపై సానుభూతి పనిచేస్తోంది. ఇటీవల వైసిపి నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు పెరుగుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో టిడిపి ఓటమితో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. హోరాహోరీ ఫైట్ ఉంటుందని మాత్రం సంకేతాలు వెలువడుతున్నాయి.
చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి బొత్స మరోసారి పోటీ చేయడం ఖాయంగా తేలింది. టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లేదా కిమిడి నాగార్జున పోటీలో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక్కడ వైసిపికి మొగ్గు కనిపిస్తున్నా.. హోరాహోరీ ఫైట్ ఉంటుందన్న సంకేతాలు కూడా ఉన్నాయి. గంట అయితే మాత్రం పెద్ద ఫైట్ నడవనుంది.
శృంగవరపుకోట నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వైసిపి టికెట్ దక్కింది. టిడిపి విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పేరు వినిపిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్సీ కుటుంబం పెద్ద ఎత్తున టిడిపిలో చేరడంతో బలం చేకూరింది. ఇక్కడ టీడీపీకి ఛాన్స్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
కురుపాం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. టిడిపి నుంచి తోయక జగదీశ్వరి పేరు ఖరారైంది. ఆమె మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్రోత్సాహంతో పోటీ చేస్తున్నారు. గట్టి ఫైట్ ఉన్నా వైసీపీకే మొగ్గు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
సాలూరు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర పేరును వైసీపీ ఖరారు చేసింది. టిడిపి నుంచి గుమ్మిడి సంధ్యారాణి పేరు ఖరారు అయ్యే పరిస్థితి ఉంది. గత మూడు ఎన్నికల్లో రాజన్న దొర గెలుపొందుతూ వచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేదన్న విమర్శ ఉంది. అయినా సరే ఇక్కడ వైసీపీకి మొగ్గు కనిపిస్తోంది.
పార్వతీపురం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కు మరోసారి వైసీపీ చాన్స్ ఇచ్చింది. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా విజయానంద్ తెరపైకి వచ్చారు. ఈయనకు మాజీ ఎమ్మెల్యే చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అండగా నిలుస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో హోరాహోరీ ఫైట్ నడిచే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి గతం కంటే పరిస్థితి మెరుగుపడినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఎన్నికల్లో గట్టి సమరమే ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Vizianagaram political ground report
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com