వివేకాది గుండెపోటు కాదు.. సొంత ఇంటి గొడ్డలిపోటా?

అది 2019 సంవత్సరం.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం. అందరూ ఎవరికి వారుగా ప్రచారంలో మునిగిపోయారు. జగన్‌ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కానీ.. అంతలోనే విషాదం. అది మార్చి 15. మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి చనిపోయారు. ముందుగా గుండె పోటుతో చనిపోయాడని అందరూ అనుకున్నా.. తర్వాత అది హత్యగా తేలింది. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న […]

Written By: NARESH, Updated On : September 25, 2020 12:29 pm
Follow us on


అది 2019 సంవత్సరం.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం. అందరూ ఎవరికి వారుగా ప్రచారంలో మునిగిపోయారు. జగన్‌ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కానీ.. అంతలోనే విషాదం. అది మార్చి 15. మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి చనిపోయారు. ముందుగా గుండె పోటుతో చనిపోయాడని అందరూ అనుకున్నా.. తర్వాత అది హత్యగా తేలింది. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ.. నిందితులు మాత్రం దొరకలేదు. తాజాగా.. వైఎస్‌ వివేకా హత్య ఇంటి గొడ్డలి పెట్టుగా సీబీఐ నిర్ధారణకు వచ్చింది. అందుకే.. ఈ కేసుతో సంబంధం ఉన్న వారంతా ఇప్పుడు ఢిల్లీ బాట పడుతున్నారు.

సిట్ అయినా, సీబీఐ విచార‌ణలో అయినా అంతా వైఎస్ ఇంటి మ‌నుషులే సూత్రధారులు, పాత్రధారులుగా తెర‌మీద‌కొస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. జ‌గ‌న్‌రెడ్డి బాబాయ్ భాస్కర్ రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వీరి రైట్ హ్యాండ్ దొండ్లవాగు శంక‌ర్‌రెడ్డి, స్నేహితుడు ఉద‌య్‌కుమార్‌‌రెడ్డిలంతా ఇటు వైఎస్ జ‌గ‌న్‌, మ‌రోవైపు వైఎస్ వివేకా ఇంటి మ‌నుషుల చుట్టే విచారణ సాగుతోంది. హ‌త్య జ‌రిగిన‌ప్పుడు ముందుగా తెలిసిన వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి. అతన్ని సీబీఐ అదుపులోకి తీసుకొని విచారించింది. యురేనియం కర్మాగారంలో పనిచేసే ఉదయ్‌ కుమార్ రెడ్డి ఫోన్ సీజ్ చేసి సీబీఐ అధికారులు డేటాను పరిశీలించారు. దొండ్లవాగు శంక‌ర్ ఇచ్చిన స‌మాచారంతో ఉద‌య్‌కుమార్‌రెడ్డిపై సీబీఐ ప్రశ్నల‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో త‌న ద‌గ్గర ఉన్న గుట్టు మొత్తం కక్కేశాడని ప్రచారం జరుగుతోంది.

హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ విచార‌ణ ఆరంభం అయిన త‌రువాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అలియాస్ దొండ్ల ‌వాగు శంక‌ర్‌రెడ్డి ప‌రారీలో ఉన్నారు. క‌రోనాకి చికిత్స పొందుతున్నానంటూ చాలా చోట్ల డ్రామాలు న‌డిపాడు. అయితే హైద‌రాబాద్‌లో దొండ్ల ‌వాగు శంక‌ర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుని మొత్తం గుట్టు లాగేశాయ‌ని విశ్వస‌నీయ స‌మాచారం. ఇక ఈ కేసులో వైఎస్ వివేకా బంధువులంతా ఇప్పుడు గుండెపోటు.. కరోనా పేరుతో సీబీఐ విచారణకు హాజరు కాకుండా ఆస్పత్రుల పాలు అవ్వడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

రెండో విడ‌త విచార‌ణ‌కొచ్చిన సీబీఐ వెతుకులాట తీవ్రం చేసింది. పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను విచారించింది.  మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షల ఎఫ్‌డీలు ఉన్నట్లు తేల్చారు. ఈ డబ్బు ఎక్కడిద‌నేదానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

అయితే..  ఇవన్నీ ఒక ఎత్తు అయితే సడన్ గా సీఎం జగన్‌ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం.. అమిత్‌షా అపాయింట్‌మెంట్ సంపాదించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రాష్ట్ర అభివృద్ధి నిధులు కోస‌మే అని వార్తలు వచ్చినా.. సీబీఐ ఏపీలో దూకుడు పెంచ‌డం, వైఎస్ వివేకా హత్య కేసును ఛేధిస్తుండడం.., ఆయ‌న అనుచ‌రుల్ని, రైట్ హ్యాండ్‌ను అదుపులోకి తీసుకోవ‌డం, మ‌రోవైపు జ‌గ‌న్ మామ గంగిరెడ్డిని విచార‌ణ‌కి పిలిచే అవ‌కాశం ఉండ‌టంతో కేంద్రాన్ని శాంతింప‌జేసే ల‌క్ష్యంతోనే ఢిల్లీ టూర్ సాగింద‌నేది రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరి ఇది నిజమా కాదా అన్నది పక్కనపెడితే జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు కారణమవుతున్నాయి.