
వైఎస్ వివేకా హత్యకేసులో గతంలో చంద్రబాబు నడిచిన బాటలోనే జగన్ వెళ్తున్నట్లుగా అర్థమవుతోంది. సీబీఐ దర్యాప్తులో నాటి అంశాలే రిపీట్ అవుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఓవైపు సిట్ దర్యాప్తు జరుపుతున్నా.. సీబీఐ దర్యాప్తు కోరుతూ టీడీపీ సర్కారుపై తీవ్ర విమర్శలకు దిగారు జగన్. ఇప్పుడు ఆయన తల్లి విజయమ్మతో ఈ కేసు దర్యాప్తు తమ చేతుల్లో లేదని చెప్పించడం వెనుక కారణాలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. జగన్‌పై కోడి కత్తి దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరినే ఇప్పుడు జగన్ కూడా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.
కడప జిల్లా పులివెందులలో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వైఎస్ కుటుంబాన్ని ఇప్పట్లో వీడేలా లేదు. ఈ హత్యలో వైఎస్ కుటుంబీకుల పాత్రపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడం, దీన్ని త్వరగా పూర్తి చేయాలని కూడా జగన్ కోరకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రాక ముందు సీబీఐ దర్యాప్తు కోసం గట్టిగా డిమాండ్ చేసి, అధికారంలోకి వచ్చాక హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడంపైనా మౌనం పాటిస్తున్న జగన్ తీరును విపక్షాలు తూర్పారపడుతున్నాయి. ఇదే క్రమంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని తాజాగా చేసిన విమర్శలతో వైసీపీ సర్కారు ఇరుకునపడింది.
విపక్షంలో ఉన్నప్పుడు బాబాయ్ వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోసం పట్టుబట్టిన జగన్ అధికారంలోకి రాగానే మౌనంగా ఉండిపోవడాన్ని తప్పుపడుతున్నారు. అంతేకాదు.. హైకోర్టును ఆశ్రయించి మరీ సీబీఐ దర్యాప్తు ఆదేశాలు తెచ్చుకున్న కుమార్తె సునీతారెడ్డి.. ఇప్పుడు జగన్ మౌనాన్ని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆమె విమర్శలకు స్పందించక తప్పని పరిస్థితి వైఎస్ కుటుంబానికి ఎదురవుతోంది. అలాగని సీఎం జగన్ దీనిపై స్పందిస్తే ఆ తర్వాత ఆమె మాట్లాడే ప్రతీ మాటకు రియాక్ట్ కావాల్సి వస్తుంది. అందుకే.. జగన్ తెలివిగా తన తల్లి విజయమ్మతో లేఖ విడుదల చేయించినట్లుగా తెలుస్తోంది.
ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోందని.. అయినా.. ఈ హత్య కేసుపై తన కుమారుడు జగన్‌ను టార్గెట్ చేయడం సరికాదని విజయమ్మ తాజా లేఖలో పేర్కొన్నారు. ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ చేతుల్లో లేని దర్యాప్తుపై తాము మౌనంగా ఉన్నామంటూ విమర్శలు చేయడమేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. కానీ.. గతంలో కేంద్రం పరిధిలోని సీఐఎస్ఎఫ్ బలగాలు కాపలా కాస్తున్న వైజాగ్ ఎయిర్‌పోర్టులో తనపై జరిగిన కోడి కత్తి దాడి కేసులో జగన్ అప్పటి టీడీపీ సర్కారును టార్గెట్ చేసి ఎన్‌ఐఏ విచారణకు ఆదేశాలు తెచ్చుకోవడం ఇక్కడ గుర్తెరగాల్సిన విషయం. విపక్షంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జగన్.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వివేకా కేసును కేంద్రంపైకి నెట్టేయడం చర్చనీయాంశమవుతోంది.