
అదేంటి.. మోడీ ఏంటి.. బీజేపీ ఓడిపోవాలని కోరుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా..! పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ప్రధాని మోడీ ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి బీజేపీ సారథ్యం వహిస్తోంది. అంతేకాదు.. కేంద్రంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఈరోజు 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని సైతం జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాషాయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. స్వీట్లు పంచి పెడుతున్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ.. పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల హృదయాలను మరింత గెలిచేలా క్యాడర్ వ్యవహరించాలని సూచించారు. పార్టీ కంటే దేశమే ముఖ్యమని చెప్పారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలకు వాస్తవ రూపం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందని సూచించారు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని కార్యకర్తలు గుర్తించాలని అన్నారు.
బీజేపీ ఎన్నికలను గెలిచిన ప్రతిసారీ పోల్ విన్నింగ్ మిషన్లుగా అభివర్ణిస్తున్నారని, అది ఎంత మాత్రం ముఖ్యం కాదని మోడీ చెప్పారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలని అన్నారు. వ్యక్తి కంటే సమూహం (పార్టీ) ముఖ్యం.. సమూహం కంటే దేశం ముఖ్యం.. అని శ్యామా ప్రసాద్ ముఖర్జీ నినదించారని.. దాన్ని సార్థకం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుచేశారు.
శ్యామా ప్రసాద్ కలలను నిజం చేస్తూ.. తాము సమైక్య భారతం కోసం పనిచేస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడమే దీనికి నిదర్శనమని చెప్పారు. దేశంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, మూడు వ్యవసాయ బిల్లులు దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఈ రెండు చట్టాలను అమలు చేయడంలో అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని, దీనికి ప్రధాన కారణం.. ప్రతిపక్ష పార్టీలేనని మోడీ అన్నారు. ప్రజల్లో లేనిపోని భయాలను కల్పించడం ద్వారా వాటిని అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు.