Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పీక నొక్కాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. బొగ్గు కృత్రిమ కొరత సృష్టించి ప్లాంట్ పై ఉక్కు పాదం మోపేందుకు వ్యూహం పన్నుతున్నారు. దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును ప్లాంట్లోకి చేరకుండా అడ్డుకుంటున్నారు. ఇందులో జగన్ సర్కార్కు అత్యంత సన్నిహిత పారిశ్రామికవేత్త అయిన అదాని కీలక పాత్ర పోషిస్తున్నారు. గంగవరం పోర్టును ఆసరాగా చేసుకుని రాజకీయ క్రీడ ఆడుతున్నారు.
గంగవరం పోర్టును అదాని బలవంతంగా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులకు గాను విదేశాల నుంచి పెద్ద ఎత్తున బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బొగ్గు ఓడలు గంగవరం పోర్టుకు చేరుకున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి తమకు బకాయిలు ఉన్నాయని.. వాటిని చెల్లిస్తే కానీ.. బొగ్గు ఓడలను విడిచి పెట్టేది లేదని ఆదాని గ్రూపు బెదిరిస్తోంది. దీంతో స్టీల్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి. మరోవైపు ఉక్కు ఉత్పత్తి నిలిచిపోతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అవసరాలకే గంగవరం పోర్టును ఏర్పాటు చేశారు. 1100 ఎకరాల భూమిని పోర్టు నిర్మాణానికి స్టీల్ ప్లాంట్ ఉదారంగా అందించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పోర్టును ఏర్పాటు చేశారు. ఒక లోతైన పోర్టు స్టీల్ ప్లాంట్ సమీపంలో ఏర్పాటు అయితే.. ఉక్కు ఉత్పత్తులు ముడి సరుకులు ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉంటుందని ఉక్కు యాజమాన్యం భావించింది. అయితే ప్రభుత్వ హక్కులను ఇటీవలే అరకొర నిధులకు ఆదానికి కట్టబెట్టారు. దీంతో గంగవరం పోర్ట్.. ఆదాని పోర్టుగా మారిపోయింది.
ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్న విశాఖ ఉక్కు యాజమాన్యం ముందస్తు వ్యూహంతోనే చెల్లింపులు నిలిపివేసింది. అదాని పోర్టుకు విశాఖ ఉక్కు కార్గో హ్యాండ్లింగ్ చార్జీలు సుమారుగా 50 కోట్లు బకాయి పడింది. వ్యూహాత్మకంగా డబ్బులు చెల్లించడం లేదు. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఇదంతా ప్రైవేటీకరణ ఎత్తుగడలో భాగమని.. అదాని కంపెనీ కుట్ర చేస్తోందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ప్రజా అవసరాల కోసమని గంగవరం పోర్టును అదానికి అప్పగించిన ఉక్కు యాజమాన్యం.. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది. ప్రైవేటీకరణ కోసం ప్రయత్నిస్తున్న కేంద్రం దీనిని సాకుగా చూపి ముందుకు అడుగులు వేసే అవకాశం ఉందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.