
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ మున్సిపల్ ఎన్నికలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. విజయవాడ రాజకీయంగా కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ కావడం ఒక కారణం అయితే… జగన్ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతిని ఆనుకుని ఉన్న విజయవాడలో ఓటర్ల మనోగతం ఎలా ఉండబోతోందన్నది మరో కారణం. అందుకే.. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతోంది.
Also Read: వైఎస్సార్ సీపీకి టీడీపీ బంపరాఫర్.. ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేయండి.. పోటీపెట్టం
ఎలాగైనా మరోసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ విశ్వప్రయత్నాలే చేస్తోంది. ఇక వైసీపీ మాత్రం తొలిసారి విజయవాడ కార్పొరేషన్ లో పాగా వేయాలని ఆరాటపడుతోంది. పట్టు నిలుపుకోవాలని వామపక్షాలు, మనుగడ చాటుకునేందుకు బీజేపీ–జనసేన ఉవ్విల్లూరుతున్నాయి. అధికార పార్టీ తరఫున రాష్ట్ర మంత్రులు విజయవాడలో మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం రోడ్ షోతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
గత ఎన్నికల్లో విజయవాడలో టీడీపీ జెండా ఎగురవేసింది. మొత్తం 59 డివిజన్లకు గాను 37 చోట్ల ఆ పార్టీ గెలుపొందింది. జనరల్ కేటగిరీలో కోనేరు శ్రీధర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. వైసీపీ 19 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం 64 స్థానాల్లోనూ వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. టీడీపీ 57 డివిజన్లలో రంగంలో ఉండగా.. సీపీఐతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఏడు స్థానాలు కేటాయించింది. ఒక డివిజన్‌లో జనసేన అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. టీడీపీకి రెండు, వైసీపీకి నాలుగు చోట్ల రెబెల్స్ బెడద ఉంది.
మరోవైపు.. టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతను ప్రకటించింది. ప్రచారం, పోలింగ్ నిర్వహణ బాధ్యతలను నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలకు అప్పగించింది. ఇక వైసీపీ మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాతే మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయాలని డిసైడ్ అయింది. ఆ పార్టీ తరఫున మంత్రి కొడాలి నాని ప్రచార బాధ్యతలను మోస్తున్నారు. సామాజిక వర్గాల ప్రకారం మంత్రులను రంగంలోకి దింపి సమావేశాలను ఏర్పాటు చేశారు. జనాభా పరంగా కీలకమైన రెండు వర్గాలను సమన్వయపరిచే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. నగరానికి చెందిన మంత్రి వెలంపలి శ్రీనివాస్‌ను వన్‌టౌన్‌కు పరిమితం చేశారు. ఇక బీజేపీ–జనసేన కూటమి వన్‌టౌన్‌తోపాటు, తూర్పు మధ్య నియోజకవర్గాల్లోని కొన్ని డివిజన్లలో ప్రభావం చూపనుంది.
Also Read: విశాఖ ఉక్కు పాపం.. బీజేపీ వైపు నెట్టిన జగన్
పార్టీల వారీగా బలబలాలు ఒకసారి చూస్తే.. వైసీపీ అధికార పక్షం కావడం దానికి ప్లస్. నగరంలో మూడు నియోజకవర్గాల్లోనూ రెండు చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రుల ప్రచారం, వాలంటీర్ల వ్యవస్థ ఆ పార్టీకి ఉంది. వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అమలు వివరిస్తున్నారు. నగరవాసులకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్లస్ కానున్నాయి. అయితే.. రాజధాని తరలింపు ప్రభావం, మహా నగర పాలక సంస్థ ఏర్పాటు కాకపోవడం.. దుర్గగుడిలో అక్రమాలు వెలుగులోకి రావడం మైనస్ కానున్నాయి.
ఇక టీడీపీ విషయానికొస్తే.. టౌన్ ఓటర్లలో టీడీపీకి పట్టు ఉంది. విజయవాడ నగర పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి స్వల్ప ఆధిక్యమే లభించింది. అధికార పక్షంపై వ్యతిరేకత, రాజధాని ఉద్యమం, ధరల పెరుగుదల, కరోనా కాలంలో పలువురు ఉపాధి కోల్పోయిన తీరు.. పట్టణ గృహనిర్మాణ పథకం టీడీపీ హయాంలోనే ప్రారంభం కావడం.. సీపీఐతో పొత్తు కలిసిరానున్నాయి. ఇదిలా ఉండగా.. నాయకుల మధ్య సమన్వయ లేమి.. ఎన్నికల వేళ విభేదాలు వెలుగు చూడడం మైనస్ అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్